ట్రిబ్యునల్ ఉత్తర్వులతో చైనాకు వణుకెందుకు?
బీజింగ్/వాషింగ్టన్: దక్షిణ చైనా సముద్రం వివాదంపై హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఆగ్నేయాసియాలో ఉద్రిక్తతలు రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ సముద్రంపై హక్కుల విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటం.. దీన్ని వ్యతిరేకిస్తూ తీర ప్రాంత దేశాలైన ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, బ్రూనై, మలేషియా దేశాలు హేగ్‌లోని మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానా(పీసీఏ)న్ని ఆశ్రయించాయి. 2013 నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండగా.. మంగళవారం తుది తీర్పు వెలువడింది. చైనాకు షాక్ ఇచ్చేరీతిలో హేగ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడటం.. ఈ ఉత్తర్వులను చైనా తిరస్కరిస్తుండటం వివాదం రేపుతున్నది.
ఒక్క అడుగు కూడా వెనక్కివేయం!
చైనాతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారానికి 17 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. అయినా చైనా స్పందించటం లేదంటూ ఫిలిప్పీన్స్ వాదిస్తోంది. అటు అమెరికా కూడా ఈ ప్రాంతంపై పట్టుకోసం ప్రయత్నించటం.. చైనాను చికాకు పెడుతోంది. అమెరికా ప్రభావం వల్ల కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా అంచనా వేసిన చైనా.. ఈ కేసు విచారణ, తీర్పుతో తమకు సంబంధం లేదని.. ఎవరేం చేసుకున్నా ఈ సముద్రంపై తనకే పూర్తి హక్కుందంటోందని వాదిస్తోంది. ఒక్క అడుగుకూడా వెనక్కువేసే ప్రసక్తే లేదంటోంది. దీంతో దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చైనా దాదాగిరీ!
2009లో దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ చైనా ప్రభుత్వం ఓ సరిహద్దు పటాన్ని విడుదల చేసింది. దీనికి తోడు వియత్నాం, ఫిలిప్పీన్స్ దేశాల సమీపంలోని దీవుల్లో ఆయా దేశాలు చమురు వెలికితీతకు ప్రయత్నించగా.. చైనా తన నావికాదళంతో కవాతు నిర్వహించింది. దీనికి ఆసియాన్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా చైనా తన దూకుడు తగ్గించలేదు. దీనికి తోడు తనకు భవిష్యత్తులో ఇబ్బందికరమని భావించిన భారత్‌ను నిరంతరం కవ్విస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ జలాల్లో తన జలాంతర్గాములను మోహరించింది.
రంగంలోకి అమెరికా!
ప్రపంచంలో అత్యంత రద్దీ అయిన నౌకా రవాణా మార్గమైన ఈ ప్రాంతం చైనా పట్టు పెరిగితే.. తనకు కష్టమనేది అమెరికా ఆలోచన. దీంతో తన మిత్రదేశాలైన ఈ ఏడెనిమిది ద్వీపాల హక్కుల పరిరక్షణకు నడుంబిగించింది. వీరికి మద్దతుగా తన యుద్ధ నౌకలను మోహరించింది. దీంతో దక్షిణచైనాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ప్రాంతంపై చైనా పట్టు తగ్గటం వ్యూహాత్మకంగా భారత్‌కూ కీలకమే. పొరుగుదేశాల జలాల్లో జలాంతర్గాములను మోహరించిన చైనాను కట్టడి చేసేందుకు.. దక్షిణచైనాపై అమెరికా ఆధిపత్యం పెరిగేలా తెరవెనక మంత్రాంగం నెరపుతోంది. ఫిలిప్పీన్స్‌కు కోర్టు తీర్పు విషయంలో బహిరంగంగా మద్దతిస్తూనే.. చైనా వ్యతిరేక దేశాలను కూడగడుతోంది. ఇక్కడున్న సహజ వనరులను వెలికితీస్తే.. వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై, తైవాన్ దేశాల తలరాత మారిపోతుందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. అదే చైనా చేతికే ఈ నిధులందితే.. అమెరికా కూటమికి కష్టమే. అందుకే ఈ ప్రాంతపై పట్టుకోసం నువ్వా, నేనా అనే రీతిలో పోటీ పెరుగుతోంది. అదే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.
వివాదమిది
దక్షిణా చైనా సముద్రంలో చైనాతో పాటు.. మలేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, బ్రూనై వంటి ఏడెనిమిది దేశాలున్నాయి. వీటితోపాటు వందల సంఖ్యలో చిన్న చిన్న ద్వీపాలున్నాయి. అయితే, సముద్రాల్లోని చమురు, సహజ వాయువు నిక్షేపాలు, మత్స్యసంపద పెద్ద పరిశ్రమగా మారటంతో.. బలమున్న దేశాలు.. చిన్న ద్వీపాలను ఆక్రమించుకుని సముద్ర సంపదపై భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి. ఈ యత్నంలో దేశాల మధ్య వివాదాలు చెలరేగకుండా 1982లో ఐక్యరాజ్యసమితి ‘సముద్ర చట్టాల ఒప్పందం’ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ఓ దేశ తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైళ్ల (22 కిలోమీటర్లు) ప్రాంతం.. ఆ దేశ సముద్ర జలాల పరిధిలోకి వస్తుంది. ఆ తర్వాత అవిచ్ఛిన్న జలాలు, అంతర్జాతీయ జలాలనూ ఇందులో చేర్చారు. దక్షిణ చైనా సముద్రం విషయానికొస్తే.. ఈ ఏడెనిమిది దేశాలు ఈ సముద్రంలోని చిన్న చిన్న ద్వీపాలను ఆక్రమించుకున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ద్వీపాలు తనవేనంటూ చైనా ప్రకటించుకోవటంతో వివాదం మొదలైంది.
కృత్రిమ దీవులు.. అణు విద్యుత్ కేంద్రాలు!
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక, సముద్ర భద్రత అవసరాల కోసం ‘ఫీరీ క్రాస్ రీఫ్’, ‘జాన్సన్ రీఫ్’ తదితర పేర్లతో చైనా ఇటీవల కొన్ని కృత్రిమ ద్వీపాలు నిర్మించింది. అక్కడి రాడార్ వ్యవస్థలు, లైట్హౌస్లు, బ్యారక్‌లు, పోర్టులు, వైమానిక స్థావరాల నిర్వహణకు భారీగా విద్యుత్ కావాలి. వేల మైళ్ల దూరంలోని భూమిపై ఉన్న పవర్ గ్రిడ్ల నుంచి వీటికి తీగల ద్వారా విద్యుత్‌ను అందించడం చాలా కష్టమైన పని. దీనికి పరిష్కారంగా.. సముద్రంలోనే అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి విద్యుత్ సరఫరా చేయాలని చైనా యోచిస్తోంది. ఈ ద్వీపాలతోపాటు చమురు రిఫైనరీల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు నౌకలపై అణు ప్లాంట్లను నిర్మించాలని చైనా షిప్పింగ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. నిజానికి తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్లు కొత్తవేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక నౌకలో అమెరికా 1960లలో అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసింది. పనామా కెనాల్ జోన్‌లోని విద్యుత్ అవసరాల కోసం దీన్ని నిర్మించారు.