చైనాకు భారీ ఎదురుదెబ్బ!
దక్షిణ చైనా సముద్రం తన గుత్తసొత్తుగా చెలరేగిపోతున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ చైనా సముద్రంలో తనకు చారిత్రక హక్కులు కలవంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధ ఆధారం లేదని ఐక్యరాజ్యసమితికి చెందిన హేగ్ అంతర్జాతీయ ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. 'నైన్ డ్యాష్ లైన్స్' పరిధిలోని సముద్ర ప్రాంతాల్లో తనకు చారిత్రక హక్కులు ఉన్నాయంటూ చైనా చేస్తున్న వాదనకు ఎలాంటి చట్టబద్ధత ఆధారం లేదని ట్రిబ్యునల్ నిర్ధారించింది' అని హేగ్‌కు చెందిన శాశ్వత వివాద పరిష్కారాల కోర్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
హేగ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఆగ్నేయా ఆసియాలో మరింతగా ఉద్రిక్తతలు రాజేసే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు చైనా ఈ ఉత్తర్వులను తప్పుబట్టింది. ట్రిబ్యునల్ ఉత్తుర్వులను అంగీకరించబోమని, గుర్తించబోమని ధిక్కార స్వరాన్ని వినిపించింది. దీవులు, దిబ్బలు సహా దక్షిణ చైనా సముద్రం మొత్తం తనదేనని చైనా వాదిస్తుండగా.. ఈ వాదనను ఇతర దేశాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ, ఓడరేవుల ఏర్పాటు తదితర చర్యలతో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ హేగ్ ట్రిబ్యునల్‌లో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ చైనాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువరించింది.
అంతేకాకుండా దక్షిణ చైనా సముద్రంలో వనరుల అన్వేషణ చేపట్టడం ద్వారా చైనా ఫిలిప్పీన్స్ సార్వభౌమాధికార హక్కులను ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది. చైనా చర్యలు పగడాల దిబ్బల్లోని పర్యావరణానికి పెనుముప్పుగా మారాయని ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది.