జైలుశిక్ష, భారీ జరిమానా: ఐటీ తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ: అక్రమలావాదేవీలు జరిపిన ఖాతాదారులపై కఠిన శిక్షలు, భారీ జరిమానా తప్పవని ఆదాయ పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బినామీ చట్టాల్ని ఉల్లఘించిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప‍్పదంటూ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. బినామీ ఆస్తి లావాదేవీలు చట్టం, 1988 ప్రకారం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ జాతీయ దినపత్రికలకు జారీ చేసిన ప్రకటనల్లో ఆదాయం పన్ను శాఖ హెచ్చరించింది. నల్లడబ్బును కలిగి ఉండటం అమానవీయమని,నేరమని పేర్కొంది. అక్రమ లావాదేవీలకు పాల్పడ వద్దంటూ ప్రజలకు సూచించింది. నల్లధనాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.
నవంబర్ 1, 2016నుంచి ఆయా ఖాతాల్లో అక్రమ డిపాజిట్లపై ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు, బినామీ ప్రాపర్టీపై మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం జరిమానాకు అర్హులని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బినామీ దారుడు, లబ్దిదారుడు ఇద్దరికీ శిక్షలు తప్పవని హెచ్చరించింది. 1961 ఆదాయచట్టం ప్రకారం ఆయా ఆస్తులను ఎటాచ్ చేయడం లేదా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం లాంటి అదనపు చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
అంతేకాదు, ఖాతాదారులు అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తే..బినామీ చట్టం ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్షకు అర్హులవుతారని హెచ్చరించింది. అలాగే బినామీ ఆస్తి మార్కెట్ వాల్యూపై 5 శాతం జరిమానా విధించనున్నామని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యకాలం 235 కేసులు, ఘటనలు నమోదయ్యాయని ఐటీ తెలిపింది. రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించి 140 షోకాజ్ నోటీసులు జారీ చేశామంది. 124 కేసుల్లో రూ .55 కోట్లకుపైన బినామీ ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసినట్టు ఐటీ శాఖ చెప్పింది. వీటిల్లో బ్యాంకు ఖాతాల డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూమి, ఫ్లాట్లు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించింది.
గత సంవత్సరం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లోని జమలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి వాటిపై ఐటి నిఘా పెంచిన సంగతి తెలిసిందే.