Benami Act
-
ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన భార్య రబ్రీ దేవీ, కూతరు మిశా భారతి, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. వీరి బినామీ ఆస్తులను సీజ్ చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులకు అటాచ్ మెంట్ నోటీసులు పంపింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీచేసింది. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.170-రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని పన్ను అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అటాచ్ మెంట్లలో పాట్నాలో ఫుల్వారీ షరీఫ్ లో ఉన్న తొమ్మిది ప్లాట్స్ ఉన్నాయి. ఇవే ఆస్తులను మే నెలలో కూడా డిపార్ట్ మెంట్ సీజ్ చేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఆదాయపన్ను కూడా ఎగ్గొట్టారన్న విమర్శలు వచ్చాయి. లాలూతో పాటు ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అక్రమంగా భూ ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బీజేపీ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మే నెలలో దాడులు జరిపారు. విచారణలో భాగంగా ఐటీ డిపార్ట్ మెంట్ ఢిల్లీ విచారణ వింగ్ ముందు హాజరుకావాలని రెండు సార్లు లాలూ ప్రసాద్ కూతురికి, ఆయన భర్తకు సమన్లు జారీచేసింది. కానీ వాటిని వారు ధిక్కరించారు. ఐటీ సమన్లను ధిక్కరించినందుకు మిశాభారతికి 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు. -
జైలుశిక్ష, భారీ జరిమానా: ఐటీ తీవ్ర హెచ్చరికలు
న్యూఢిల్లీ: అక్రమలావాదేవీలు జరిపిన ఖాతాదారులపై కఠిన శిక్షలు, భారీ జరిమానా తప్పవని ఆదాయ పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బినామీ చట్టాల్ని ఉల్లఘించిన వారికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తప్పదంటూ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. బినామీ ఆస్తి లావాదేవీలు చట్టం, 1988 ప్రకారం ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ జాతీయ దినపత్రికలకు జారీ చేసిన ప్రకటనల్లో ఆదాయం పన్ను శాఖ హెచ్చరించింది. నల్లడబ్బును కలిగి ఉండటం అమానవీయమని,నేరమని పేర్కొంది. అక్రమ లావాదేవీలకు పాల్పడ వద్దంటూ ప్రజలకు సూచించింది. నల్లధనాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. నవంబర్ 1, 2016నుంచి ఆయా ఖాతాల్లో అక్రమ డిపాజిట్లపై ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్షతోపాటు, బినామీ ప్రాపర్టీపై మార్కెట్ విలువ ఆధారంగా 25 శాతం జరిమానాకు అర్హులని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో బినామీ దారుడు, లబ్దిదారుడు ఇద్దరికీ శిక్షలు తప్పవని హెచ్చరించింది. 1961 ఆదాయచట్టం ప్రకారం ఆయా ఆస్తులను ఎటాచ్ చేయడం లేదా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం లాంటి అదనపు చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఖాతాదారులు అధికారులకు తప్పుడు సమాచారం అందిస్తే..బినామీ చట్టం ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్షకు అర్హులవుతారని హెచ్చరించింది. అలాగే బినామీ ఆస్తి మార్కెట్ వాల్యూపై 5 శాతం జరిమానా విధించనున్నామని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి మధ్యకాలం 235 కేసులు, ఘటనలు నమోదయ్యాయని ఐటీ తెలిపింది. రూ.200 కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించి 140 షోకాజ్ నోటీసులు జారీ చేశామంది. 124 కేసుల్లో రూ .55 కోట్లకుపైన బినామీ ఆస్తులను తాత్కాలికంగా ఎటాచ్ చేసినట్టు ఐటీ శాఖ చెప్పింది. వీటిల్లో బ్యాంకు ఖాతాల డిపాజిట్లు, వ్యవసాయ, ఇతర భూమి, ఫ్లాట్లు ఆభరణాలు ఉన్నాయని వెల్లడించింది. గత సంవత్సరం నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాల్లోని జమలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి వాటిపై ఐటి నిఘా పెంచిన సంగతి తెలిసిందే. -
87 నోటీసులు, రూ.42 కోట్లు అటాచ్
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా 2016 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన బినామీ లావాదేవిల చట్టం కింద దేశవ్యాప్తంగా 87 నోటీసులు పంపామని, రూ.42 కోట్ల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నామని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము బినామీ అకౌంట్లు, జన్ ధన్ ఖాతాల్లో జమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన అకౌంట్లను జల్లెడ పట్టేందుకు ఐటీ అధికారులు చర్యలు మొదలుపెట్టారంది. -
బినామీ చట్టంలో లోపాలను సవరించాలి : వైవీ
కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: బినామీ చట్టంలోని పలు లోపాలను సవరించాలని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పటిష్ట నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారని, అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. అనేక చట్టాలున్నా వాటిలో లోపాలను వెతికి మరీ బినామీ లావాదేవీలకు పాల్పడుతున్న ఉదంతాలు చూస్తున్నామని పేర్కొన్నారు. పైగా విచారణ యంత్రాంగమని, దానిపై న్యాయ నిర్ణయాధికారి అని, అప్పిలేట్ ట్రిబ్యునల్ అని, హైకోర్టు అని ఇలా అనేక అవకాశాలిస్తూ.. అంతిమంగా బినామీలకు సాయం చేస్తున్నట్టు కాదా? అని ఆయన ప్రశ్నించారు. బినామీ లావాదేవీలు జరిపే వారికి న్యాయ పరిష్కారంలో ఒకట్రెండు అవకాశాలే కల్పించాలని సూచించారు. అప్పిలేట్ అథారిటీ వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతివ్వాలని, తద్వారా వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.