ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
Published Tue, Jun 20 2017 4:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన భార్య రబ్రీ దేవీ, కూతరు మిశా భారతి, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. వీరి బినామీ ఆస్తులను సీజ్ చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులకు అటాచ్ మెంట్ నోటీసులు పంపింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీచేసింది.
ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.170-రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని పన్ను అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అటాచ్ మెంట్లలో పాట్నాలో ఫుల్వారీ షరీఫ్ లో ఉన్న తొమ్మిది ప్లాట్స్ ఉన్నాయి. ఇవే ఆస్తులను మే నెలలో కూడా డిపార్ట్ మెంట్ సీజ్ చేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఆదాయపన్ను కూడా ఎగ్గొట్టారన్న విమర్శలు వచ్చాయి. లాలూతో పాటు ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అక్రమంగా భూ ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బీజేపీ ఇటీవల ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మే నెలలో దాడులు జరిపారు. విచారణలో భాగంగా ఐటీ డిపార్ట్ మెంట్ ఢిల్లీ విచారణ వింగ్ ముందు హాజరుకావాలని రెండు సార్లు లాలూ ప్రసాద్ కూతురికి, ఆయన భర్తకు సమన్లు జారీచేసింది. కానీ వాటిని వారు ధిక్కరించారు. ఐటీ సమన్లను ధిక్కరించినందుకు మిశాభారతికి 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు.
Advertisement
Advertisement