Lalu Prasad Yadav family
-
Land-for-job case: లాలూ కుటుంబానికి ఊరట
న్యూఢిల్లీ: భూమికి ఉద్యోగం కుంభకోణంలో నిందితులుగా ఉన్న నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి తదితరులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఇటీవల మూత్రపిండమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న లాలూ బుధవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల ప్రాంగణానికి చేరుకుని జడ్జి ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులూ వెంట వచ్చారు. లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి తదితరులకు ప్రతి ఒక్కరికీ చెరో రూ.50,000 విలువైన వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో పూచీకత్తు సమర్పించాలని సూచిస్తూ అందరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఉత్తర్వులు జారీచేశారు. బెయిల్ కోసం నిందితులు గతంలో పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తోసిపుచ్చలేదు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 29వ తేదీకి వాయిదావేసింది. భారతీయ రైల్వే నియామకాల్లో పేర్కొన్న నిబంధనావళిని తొక్కిపెట్టి తమకు తక్కువ ధరకు భూములు దక్కేలా చేసిన ఉద్యోగార్థులకు వేర్వేరు జోన్లలో తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇప్పించారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదుచేసి సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే. -
ఆర్జేడీలో అన్నదమ్ముల పోరు?
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిన్న విషయాన్ని భూతద్దంలో చూడవద్దని చిన్న కొడుకు తేజస్వీయాదవ్ పార్టీ శ్రేణులను కోరినప్పటికీ ఇద్దరి మధ్య అంతరం పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి. ‘అర్జునుడిని హస్తినాపురం సింహాసనంపై కూర్చోబెట్టి ద్వారకకు తిరిగెళ్లిన కృష్ణుడిలా ఉండాలనుకుంటున్నా’ అని తేజ్ ప్రతాప్ ట్వీట్ చేశారు. దాంతో ఎన్నికల అనంతరం సోదరుడు తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేసి, ఆ తరువాత ఆయన రాజకీయాల నుంచి రిటైర్ కానున్నారనే వార్తలు ఆర్జేడీ వర్గాల్లో వ్యాపించాయి. అనంతరం తేజ్ ప్రతాప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పార్టీలోనే కొనసాగుతా. ఆర్జేడీని స్థాపించిన మా తండ్రి, ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు. కొందరు లోపలి వ్యక్తుల కారణంగా పార్టీకి హాని కలుగుతోంది. అవి సంఘ వ్యతిరేక శక్తులు. వాళ్లు మా తల్లిదండ్రులు, తేజస్వీ, మిసా(సోదరి, రాజ్యసభ ఎంపీ), నా పేరు వాడుకుని స్వార్థం కోసం పార్టీని నాశనం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. దీనిపై తేజస్వీ స్పందిస్తూ..‘మా అన్నతో నాకు అభిప్రాయ భేదాలున్న మాట అవాస్తవం. తేజ్‌ప్రతాప్ నాకు సోదరుడు, మార్గదర్శకుడు. చిన్న విషయాలను పెద్దగా చూడొద్దు’ అని అన్నారు. -
ఆర్జేడీ అధినేతకు భారీ ఎదురుదెబ్బ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఆయన భార్య రబ్రీ దేవీ, కూతరు మిశా భారతి, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లకు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ బినామి లావాదేవీల చట్టాన్ని ప్రయోగించింది. వీరి బినామీ ఆస్తులను సీజ్ చేసిన వెంటనే ఆదాయపు పన్ను శాఖ లాలూ కుటుంబానికి చెందిన ఆస్తులకు అటాచ్ మెంట్ నోటీసులు పంపింది. ఢిల్లీ, పాట్నాలో ఉన్న లాలూ ప్రసాద్ కుటుంబానికి చెందిన 9 కోట్లకు పైగా విలువైన భూములు, ప్లాట్లు, భవంతులను ఆస్తులను ఈ యాక్ట్ కింద అటాచ్ మెంట్ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసు జారీచేసింది. ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ రూ.170-రూ.180 కోట్ల వరకు ఉండొచ్చని పన్ను అధికారులు అంచనావేస్తున్నారు. ఈ అటాచ్ మెంట్లలో పాట్నాలో ఫుల్వారీ షరీఫ్ లో ఉన్న తొమ్మిది ప్లాట్స్ ఉన్నాయి. ఇవే ఆస్తులను మే నెలలో కూడా డిపార్ట్ మెంట్ సీజ్ చేసింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ఆస్తులు లాలూ కుటుంబీకుల పేరున ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారంతా ఆదాయపన్ను కూడా ఎగ్గొట్టారన్న విమర్శలు వచ్చాయి. లాలూతో పాటు ఆయన కుమార్తె, ఇద్దరు కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ అక్రమంగా భూ ఒప్పందాలు కుదర్చుకున్నట్లు బీజేపీ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు మే నెలలో దాడులు జరిపారు. విచారణలో భాగంగా ఐటీ డిపార్ట్ మెంట్ ఢిల్లీ విచారణ వింగ్ ముందు హాజరుకావాలని రెండు సార్లు లాలూ ప్రసాద్ కూతురికి, ఆయన భర్తకు సమన్లు జారీచేసింది. కానీ వాటిని వారు ధిక్కరించారు. ఐటీ సమన్లను ధిక్కరించినందుకు మిశాభారతికి 10వేల రూపాయల జరిమానా కూడా విధించారు.