
న్యూఢిల్లీ: భూమికి ఉద్యోగం కుంభకోణంలో నిందితులుగా ఉన్న నాటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతుళ్లు మీసా భారతి తదితరులకు కోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఇటీవల మూత్రపిండమార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న లాలూ బుధవారం ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టుల ప్రాంగణానికి చేరుకుని జడ్జి ఎదుట హాజరయ్యారు. ఇతర నిందితులూ వెంట వచ్చారు.
లాలూ, రబ్రీ దేవి, మీసా భారతి తదితరులకు ప్రతి ఒక్కరికీ చెరో రూ.50,000 విలువైన వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి మరో పూచీకత్తు సమర్పించాలని సూచిస్తూ అందరికీ బెయిల్ మంజూరుచేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఉత్తర్వులు జారీచేశారు. బెయిల్ కోసం నిందితులు గతంలో పెట్టుకున్న అభ్యర్థనలను కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తోసిపుచ్చలేదు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 29వ తేదీకి వాయిదావేసింది. భారతీయ రైల్వే నియామకాల్లో పేర్కొన్న నిబంధనావళిని తొక్కిపెట్టి తమకు తక్కువ ధరకు భూములు దక్కేలా చేసిన ఉద్యోగార్థులకు వేర్వేరు జోన్లలో తక్కువ స్థాయి ఉద్యోగాలు ఇప్పించారని లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కేసు నమోదుచేసి సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment