బినామీ చట్టంలో లోపాలను సవరించాలి : వైవీ
కేంద్రాన్ని కోరిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: బినామీ చట్టంలోని పలు లోపాలను సవరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. బినామీ లావాదేవీల నిషేధ చట్టానికి సవరణ ప్రతిపాదిస్తూ కేంద్రం తెచ్చిన బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పటిష్ట నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారని, అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరు ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. అనేక చట్టాలున్నా వాటిలో లోపాలను వెతికి మరీ బినామీ లావాదేవీలకు పాల్పడుతున్న ఉదంతాలు చూస్తున్నామని పేర్కొన్నారు.
పైగా విచారణ యంత్రాంగమని, దానిపై న్యాయ నిర్ణయాధికారి అని, అప్పిలేట్ ట్రిబ్యునల్ అని, హైకోర్టు అని ఇలా అనేక అవకాశాలిస్తూ.. అంతిమంగా బినామీలకు సాయం చేస్తున్నట్టు కాదా? అని ఆయన ప్రశ్నించారు. బినామీ లావాదేవీలు జరిపే వారికి న్యాయ పరిష్కారంలో ఒకట్రెండు అవకాశాలే కల్పించాలని సూచించారు. అప్పిలేట్ అథారిటీ వరకు వెళ్లేందుకు మాత్రమే అనుమతివ్వాలని, తద్వారా వివాదాలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు.