సీఎంగారు క్షమించండి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ క్షమాపణలు చెప్పారు. 'ఎవరి మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశం నాకు లేదు. మన గౌరవనీయురాలైన ముఖ్యమంత్రిగారు నా వ్యాఖ్యలను అవమానంగా భావిస్తే.. ఆమెకు క్షమాపణలు చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు' అని ఆయన మంగళవారం విలేకరులతో అన్నారు.
పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మమతను జుట్టు పట్టి ఈడ్చి పారేసి ఉండాల్సిందని దిలీప్ ఘోష్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'పెద్దనోట్ల రద్దుతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత వేలకోట్ల రూపాయల నష్ట పోయారు. అందుకే ఆమెకు మతి భ్రమించింది. ఢిల్లీలో ఆమె డ్రామా (ఆందోళన) చేస్తున్నపుడు జుట్టు పట్టి లాగి విసిరి పారేసి ఉండవచ్చు.. అక్కుడన్న పోలీసులు మన వాళ్లే.. కానీ మేం అలా చేయలేదు' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. తరచూ పరుషమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న దిలీప్ ఘోష్ తీరుపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. అయితే, తాను మమతకు క్షమాపణలు చెప్పలేదని, కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేశానని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఘోష్ మాటమార్చారు.