గవర్నర్, సీఎం మమత మధ్య వార్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాల వద్ద సైనిక బలగాల మోహరింపు విషయంలో సీఎం మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలను ఆ రాష్ట్ర గవర్నర్ కేశ్రీనాథ్ త్రిపాఠి పరోక్షంగా తోసిపుచ్చారు. బాధ్యతాయుతమైన ఆర్మీ వంటి వ్యవస్థలపై ఆరోపణలు చేసేముందు జాగ్రత్త వహించాల్సిన అవసరముందని ఆయన సూచించారు. అయితే, గవర్నర్ వ్యాఖ్యలను సీఎం మమత తప్పుబట్టారు. కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
‘కేంద్రం గొంతునే గవర్నర్ వినిపిస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా ఆయన నగరంలో లేరు. ప్రటకనలు చేసేముందు నిజానిజాలు తెలుసుకోవాలి. ఇది చాలా దురదృష్టకరం’ అని మమత మీడియాతో అన్నారు. టోల్‌ప్లాజాల వద్ద అనూహ్యంగా సైన్యాన్ని మోహరించడంతో దీనిపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్యం మోహరింపును వ్యతిరేకిస్తూ.. వెంటనే బలగాలను వెనుకకు పంపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజ్‌భవన్ ముందు తృణమూల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆందోళన నిర్వహించారు. శనివారం గవర్నర్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇంతలో గవర్నర్ త్రిపాఠి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.