కొత్త కొత్తగా ఉన్నది...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల విపణిలో భారత్ కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. ఆకర్షణీయ ఫీచర్లు, అప్లికేషన్లు, డిజైన్లతో కస్టమర్ల హృదయాలను ‘టచ్’ చేస్తుండండంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు అంచనాలను మించి నమోదవుతున్నాయి. 2014లో దేశవ్యాప్తంగా 22.5 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. అత్యంత ఆసక్తికర అంశమేమంటే కొత్తగా స్మార్ట్‌ఫోన్‌ను కొనేవారు 92 శాతం మంది ఉంటారట. అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న అమెరికాను వెనక్కినెట్టి, స్మార్ట్‌ఫోన్ల విషయంలో నువ్వా నేనా అన్నట్టు చైనాతో భారత్ పోటీ పడుతుండడం విశేషం.
దూసుకెళ్తున్నాయి..
50 వేలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఫ్యాబ్లెట్లతో కలిపి స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు అంచనాల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఈ నగరాల్లో గతేడాది నవంబరులో రూ.3,423 కోట్ల విలువైన 28.68 లక్షల పీసులు అమ్ముడయ్యాయి. అంతకు ముందు నెలలో రూ.3,202 కోట్ల విలువైన 26.88 లక్షల స్మార్ట్‌ఫోన్లు విక్రయమయ్యాయి. సరాసరిగా ఒక్కో పీసుకు చేస్తున్న వ్యయం అక్టోబరులో రూ.11,916 ఉంటే, నవంబరులో రూ.11,937లకు చేరింది. 2012 నవంబరుతో పోలిస్తే ఏడాదిలో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు రెండింతలయ్యాయి.
ఖరీదైనవి కొంటున్నారు..
విలువ పరంగా రూ.30 వేలు ఆపై ఖరీదున్న ఫోన్ల వాటా అక్టోబరులో 20.3 శాతముంటే, తర్వాతి నెలకు 21.4 శాతానికి చేరింది. ఈ విభాగంలో ఆపిల్ వాటా అనూహ్యంగా 8.8 నుంచి 29.1 శాతానికి ఎగబాకింది. నవంబరుతో ముగిసిన ఏడాదిలో రూ.30 వేలకుపైగా ఖరీదున్న మోడళ్లు దాదాపు రెండింతలు నమోదై 1.77 లక్షల పీసులుగా ఉంది. రూ.7 వేలలోపున్న స్మార్ట్‌ఫోన్లతోపాటు రూ.15-20 వేల శ్రేణిలో లభించే మోడళ్ల అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. ఇక రాష్ట్రంలో రూ.10 వేల లోపు విభాగంలో శామ్‌సంగ్, నోకియా, మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్‌లు టాప్‌లో నిలిచాయి.
చైనాతో గట్టి పోటీ..
ఈ ఏడాది చైనాలో 28.3 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. ఇందులో కొత్తగా కొనేవారు 21.6 కోట్ల మంది. కొంచెం తక్కువగా భారత్‌లో ఈ సంఖ్య 20.7 కోట్లు ఉండొచ్చని ఒక పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. అదే అమెరికాలో ఈ ఏడాది 8.9 కోట్ల స్మార్ట్‌ఫోన్లు విక్రయమవుతాయని, వీటిలో కొత్త కస్టమర్లు 4.75 కోట్ల మంది ఉంటారని అంచనా. మొత్తం అమ్మకాల పరంగా తొలి పది స్థానాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా, జపాన్, మెక్సికో, జర్మనీ, ఫ్రాన్స్, యూకేలు నిలవనున్నాయి. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 15.6 కోట్ల మంది ఉన్నట్టు సమాచారం.