పండుగ ఆఫర్లతో జాగ్రత్త !
రిటైల్ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ పథకాలను ప్రకటించడంతో రెట్టించిన ఉత్సాహంతో రిటైల్ సంస్థలు కూడా ఆఫర్లిస్తున్నాయి. అయితే బ్యాంకులు చౌకగా రుణాలు ఇస్తున్నాయని, కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నాయని షాపింగ్ చేస్తే మీ క్రెడిట్ హిస్టరీకే ప్రమాదం తప్పకపోవచ్చు. అందుకే పండుగల వేళ షాపింగ్‌లో పాటించాల్సిన ముఖ్యమైన కొన్ని అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
ఏటా దసరా షాపింగ్ చేసే అలవాటున్న కమలేష్ ఈ ఏడాది కూడా పిల్లల దుస్తుల కోసం హైదరాబాద్‌లోని ఒక షాపింగ్‌మాల్‌కి వెళ్లాడు. ఈ లోగా ఆ షాప్‌లో వస్తున్న అనౌన్స్‌మెంట్ అతన్ని చక్కగా ఆకర్షించింది. ‘మా షాపులో రూ.2,000 కొనుగోలు చేస్తే రూ.1,000 గిఫ్ట్ కూపన్ ఉచితం’ అనేది ఆ ప్రకటన సారాంశం. అంటే రెండు వేలు పెట్టి కొంటే వెయ్యి రూపాయలు తిరిగి వచ్చేస్తాయి కదా అని అవసరం లేకున్నా రెండు వేలు బిల్లు చేశాడు. బిల్లు పే చేసిన తర్వాత కింద ఎగ్జిట్ గేట్ వద్ద కూపన్ వసూలు చేసుకోమన్నారు. అక్కడ తీసుకుంటే కాని అసలు సంగతి బోధపడలేదు. వరుసగా నాలుగు నెలలు మా షాపులో రూ.2,000కు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తే నెలకు రూ.250 చొప్పున ఈ కూపన్లు వినియోగించుకోవచ్చని చెప్పారు. అంటే అయిదు నెలలు పాటు గ్యారంటీగా రూ.10,000 షాపింగ్ చేసే విధంగా ఆ సంస్థ మనతో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే వచ్చిన డిస్కౌంట్ 10 శాతమే. అంతే కాకుండా రెండువేలు అని షాపింగ్‌కి వెళితే అంతకంటే ఎక్కువే చేస్తాం. ఆ విధంగా చూస్తే డిస్కౌంట్ ఇంకా తగ్గిపోతుంది.
భారీ షాపింగ్‌తో జాగ్రత్త...
ఇప్పుడున్న పాత టీవీ స్థానంలో కొత్త టీవీ మార్చుకోవాలనుకున్నా, ఇంట్లోని ఫర్నిచర్, ఐఫోన్లు వంటి ఖరీదైన వస్తువులు కొనాలన్నా చక్కటి ప్లానింగ్ అవసరం. బ్యాంకులు 0% వడ్డీ రుణాలపై ఆర్‌బీఐ నిషేధం విధించినప్పటికీ ఎన్‌బీఎఫ్‌సీలు, క్రెడిట్ కార్డు సంస్థలు వీటిని ఇంకా ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు మహేష్ రూ.40,000 పెట్టి ఐ-ఫోన్‌ను 0% వడ్డీమీద కొన్నాడు అనుకుందాం. డౌన్ పేమెంట్‌గా రూ.4,000 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని 6 నెలల్లో రూ,6,000 సమాన వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది. కాని తీరా తన క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్ చూస్తే ఈఎంఐ రూ.6,833గా ఉంది. ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీసు ట్యాక్సు కింద అదనంగా రూ.833 అంటే 6 నెలల్లో రూ.5,000 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇలాంటి స్కీంలో అంతర్గతంగా ఏమైనా నిబంధనలున్నాయా అని ఒకటికి రెండుసార్లు అడగాలి.
డిఫాల్టు కావద్దు..
చౌకగా రుణం వస్తోంది కదా లేక రూపాయి డౌన్ పేమెంట్‌తోనే వస్తువు వచ్చేస్తోంది కాదా అని కొనొద్దు. ఒక వస్తువును కొనే ముందు అది మనకు ఎంత వరకు అవసరం, రుణంతో కొన్న తర్వాత దాన్ని క్రమం తప్పకుండా తీర్చే ఆర్థిక శక్తి ఉందా లేదా అన్న విషయం పరిశీలించండి. ఇలా వాయిదాల పద్థతిలో తీసుకొని ఒక నెల వాయిదా కట్టకపోయినా అది మీ క్రెడిట్ హిస్టరీపై నెగటివ్ ప్రభావం చూపుతుంది.
ఆఫర్లతో జాగ్రత్త: చాలా రిటైల్ సంస్థలు ఈ పండుగల సీజన్‌లో 10% నుంచి 70% వరకు డిస్కౌంట్ అని ప్రకటిస్తాయి. తీరా బిల్లింగ్ దగ్గరికి వెళ్లే సరికి దీనిపైన కేవలం 10%, లేదా 15% డిస్కౌంటే ఉందని, 70% డిస్కౌంట్ కేవలం ఆ ఒక్క వస్తువు మీద ఉందంటాడు. అప్పటికే షాపింగ్ చేసి అలసి ఉండటంతో ఇక మార్చే ఓపిక లేక షాపింగ్ పూర్తి చేస్తారు. ముఖ్యంగా అప్‌టు 50% అని డిస్కౌంట్ ఉన్నచోట ఎంచుకునే వస్తువుపై ఎంత డిస్కౌంట్ ఉందో ముందే అడిగి తెలుసుకోండి. సాధారణంగా చాలా షాపులు అమ్ముడు కాని బాగా ఓల్డ్ స్టాక్ మీద మాత్రమే గరిష్ట డిస్కౌంట్‌ను ప్రకటిస్తాయి.
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం