పాకిస్తాన్ లోని భగత్ సింగ్ ఇంటికి భారీ నిధులు
లాహోర్: భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇంటికి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు పాకిస్తాన్ శ్రీకారం చుట్టింది. పాకిస్తాన్ లో ఉన్న భగత్ సింగ్ పూర్వీకుల ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి భారీ నిధులను విడుదల చేసింది. దీంతో పాటుగా ఆయన పేరు మీద ఉన్న స్కూల్ పనులను కూడా చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 80 మిలియన్లు(రూ.8 కోట్లు)ను విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బంగే గ్రామంలో తాగునీటి సమస్యతో పాటు, డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో ఆ నిధుల్లోని కొంత మొత్తాన్ని వాటికి కేటాయించనున్నారు. ప్రస్తుతం ఫైసలాబాద్ మ్యూజియంలో ఉన్న భగత్ సింగ్ కు చెందిన వస్తువులను నిర్మాణ పనులు పూర్తి చేసుకోబోతున్నఇంటికి చేర్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. లాహోర్ కు 150 కి.మీ దూరంలో ఉన్న బంగే గ్రామంలో భగత్ సింగ్ 1907, సెప్టెంబర్ 28వ తేదీన జన్మించారు.