బ్యాంకాక్ లో భారీ పేలుడు | big blast at bankok | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్ లో భారీ పేలుడు

Published Tue, Aug 18 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

బ్యాంకాక్ లో భారీ పేలుడు

బ్యాంకాక్ లో భారీ పేలుడు

  •  27 మంది మృతి
  • 117 మందికి పైగా గాయాలు
  • బ్రహ్మదేవుడి ఆలయ ప్రాంగణంలో ఘటన
  •  బ్యాంకాక్: పర్యాటక నగరమైన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ భీకర బాంబు పేలుడుతో దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున, వాణిజ్య ప్రాంతంలోని సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయం సాక్షిగా దుండగులు నెత్తుటేర్లు పారించారు. గుడి ఆవరణలోనే అత్యంత శక్తిమంతమైన బాంబును పేల్చి 27 మందిని బలి తీసుకున్నారు.  పేలుడు ధాటికి అక్కడి కార్లు, బైకులు కూడా పేలిపోయాయి. 117 మందికిపైగా గాయపడ్డారు. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఆ ప్రాంతం చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల రోదనలు, తెగిపడిన శరీరాంగాలతో  భీతావహంగా మారింది. పరిస్థితిని సమీక్షించేందుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు దేశ ప్రధాని ప్రయుత్ చనోచా వెల్లడించారు. ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత తీసుకోలేదు.

    స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు చిద్లోమ్ డిస్ట్రిక్ట్, రాజ్‌ప్రసంగ్ జంక్షన్‌లోని ‘ఎరవాన్ (బ్రహ్మదేవుడి) ఆలయం’ ప్రాంగణంలో ఉన్న ఒక స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలో అక్కడున్న బైక్‌లు, కార్లు పేలిపోయాయి. చిన్న వాహనాలు ఎగిరి పడ్డాయి. ఆ పక్కనే మూడు పెద్ద షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ స్థాయి హోటళ్లు ఉండటం, సాయంత్రం కావడంతో అక్కడంతా రద్దీగా ఉంది. దాంతో పేలుళ్ల బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. మృతుల్లో ఇద్దరు చైనీయులు, ఒకరు ఫిలిప్పీన్స్ దేశీయుడు సహా నలుగురు విదేశీయులు ఉన్నారు. 16 మంది చనిపోయారని పోలీసులు చెప్పగా, 27 మంది చనిపోయినట్లు థాయ్ టీవీ తెలిపింది. ఈ ‘ఫ్రా ప్రొం(బ్రహ్మదేవుడు)’ గుడి బ్యాంకాక్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. రాజ్‌ప్రసంగ్ ఇటీవల రాజకీయ ప్రదర్శనలకు వేదికకైంది.

    పేలుడు ధాటికి గుడి చుట్టూ ఉన్న ఇనుపకంచె ముక్కలైంది. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ‘అది టీఎన్‌టీ బాంబు. మా పర్యాటకరంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు బ్యాంకాక్ వచ్చిన విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులకు తెగబడ్డారు’ అని రక్షణ మంత్రి వాంగ్‌సువాంగ్ చెప్పారు. 5 కేజీల టీఎన్‌టీ బాంబును పేల్చారని, 40 అడుగుల విస్తీర్ణంలో దాని ప్రభావం పడిందని పోలీసులు చెప్పారు. అక్కడే ఉంచిన మరో రెండు బాంబుల్ని నిర్వీర్యం చేశారని మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ దౌత్యాధికారుల లక్ష్యంగా కొందరు ఇరాన్ దేశీయులు చేసిన దాడిగా దీన్ని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
      పలువురు ఇరాన్ దేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో ఒకరు పేలుళ్లలో గాయపడ్డారన్నారు. మృతుల్లో, క్షతగాత్రుల్లో భారతీయులున్నట్లు సమాచారం రాలేదని థాయ్‌లాండ్‌లో భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు. థాయ్‌లో బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాదఘటనలు అరుదు. 2012 నాటి పేలుళ్లలో ఐదుగురు గాయపడ్డారు.

     మోదీ ఖండన.. ఈ పేలుళ్లపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement