భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం
భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం
Published Mon, Sep 26 2016 2:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
డిస్పూర్ : బుర్ద్వాన్ పేలుడు కేసులో దర్యాప్తు బృందాలు మంచి పురోగతి సాధించాయి. జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్బీ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను అసోంలో పోలీసులు అరెస్టు చేశారు. 2014 అక్టోబర్లో జరిగిన బుర్ద్వాన్ పేలుళ్లలో వీరు ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా వీరి కార్యకలాపాలపై దృష్టిసారించిన కోల్కత్తా పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఈ ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. ఈ ఆరుగురిలో ముగ్గురు బంగ్లాదేశ్కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఇండియాకు చెందిన జమాత్-ఉల్-ముజాహుద్దీన్ ఉగ్రవాదులు.
ప్రాథమిక రిపోర్టుల ప్రకారం బుర్ద్వాన్ పేలుడు ఘటనతో లింక్ ఉన్న ఈ ఆరుగురు టెర్రరిస్టులలో ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు కోరినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు డిటోనేటర్లు, కేబుల్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సంయుక్త పోలీసు కమిషనర్ విశాల్ గార్గ్ తెలిపారు. అరెస్టు అయిన వారు, బంగ్లాదేశ్లో ఎంపికయ్యే ప్రభుత్వంపై, భారత సరిహద్దు రాష్ట్రాలలో దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు పన్నుతున్నట్టు అధికారులు చెప్పారు. ఎన్ఏఐ అధికారులు వీరిని విచారిస్తారని, పేలుడు ఘటనతో సంబంధం ఉన్న మిగతా ఆధారాలను సేకరిస్తారని టాస్క్ ఫోర్స్ చెప్పింది.
బుర్ద్వాన్లోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు బాంబులు తయారుచేస్తుండగా జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాటి ఘటనలో పేలుడు పదార్థాల తయారీలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు మృత్యువాత పడగా, మరొకరు గాయపడ్డారు. ఆ ఘటనపై స్పెషల్ టాస్క్ ఫోర్స్, జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.
Advertisement
Advertisement