బిహార్ పోరు నగారా!
ఐదు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు..
నవంబర్ 8న ఫలితాలు
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ,
ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు
న్యూఢిల్లీ: బిహార్‌లో బ్యాలెట్ యుద్ధానికి తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో ఈ ఎన్నికలను నిర్వహించనున్నట్లు బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ వెల్లడించారు. నవంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. బిహార్ ప్రస్తుత శాసనసభ కాలపరిమితి నవంబర్ 29తో ముగియనుంది. 2010లో జరిగిన గత ఎన్నికల్లో 6 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. బిహార్‌లో 6.68 కోట్లమంది ఓటర్లున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో పరాజయం చవిచూసిన బీజేపీకి.. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా జట్టుకట్టిన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమికి ఈ ఎన్నికల్లో గెలవడం అత్యంత కీలకం. ముఖ్యంగా, బీజేపీ ప్రధాన ప్రచార కర్త ప్రధాని మోదీ.. జేడీయూ నేత, సీఎం నితీశ్‌కుమార్‌ల ప్రజాదరణకు ఇవి విషమ పరీక్షగా నిలవనున్నాయి. ఇప్పటికే ఈ రెండు కూటములు ప్రచారాన్ని ప్రారంభించాయి. రెండు దశాబ్దాల లాలూ-నితీశ్‌ల పాలనకు అంతం పలికే లక్ష్యంతో.. మోదీ బిహార్‌కు రూ. 1.65 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే దసరా, ఈద్, మొహర్రం, చాత్ మొదలైన ప్రధాన పండుగలు వస్తుండటంతో ఈ ఎన్నికల నిర్వహణ ఈసీకి కత్తిమీద సాములా మారింది.
6 వేలమందితో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల కమిషనర్లు అచల్‌కుమార్ జోటి, ఓం ప్రకాశ్ రావత్‌లతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న సీఈసీ జైదీ 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలను వివరించారు. అక్టోబర్ 12, 16, 28, నవంబర్ 1, 5 తేదీల్లో ఈ ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నసీం జైదీ తెలిపిన సమాచారం ప్రకారం..
►అక్టోబర్ 12న 10 జిల్లాల్లో విస్తరించి ఉన్న 49 నియోజకవర్గాలకు మొదటి దశలో, అక్టోబర్ 16న ఆరు జిల్లాల్లోని 32 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి. నక్సల్స్ ప్రాంతాల్లో ఎన్నికలు ఈ రెండు విడతల్లోనే పూర్తవుతాయి.
►అక్టోబర్ 28న మూడో విడత ఎన్నికల్లో 50 నియోజకవర్గాలకు, నవంబర్ 1వ తేదీన నాలుగో దశలో 55 స్థానాలకు, చివరి విడతలో నవంబర్ ఐదున 57 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.
►ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన దీపావళికి 3రోజుల ముందు, నవంబర్ 8న ఉంటుంది. బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది.
►తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈనెల 16న వెలువడనుంది.
► ఈవీఎంపై అభ్యర్థి పేరు, అతడికి కేటాయించిన ఎన్నికల గుర్తు మధ్యన ఆ అభ్యర్థి ఫొటోను కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఒకే పేరున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా ఉంటారు.
►36 నియోజకవర్గాల్లోని ఈవీఎంలలో ‘ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్’ సదుపాయం ఉంటుంది. దీనిద్వారా ఓటు ఎవరికి వేశానో ఓటరు నిర్ధారించుకునేలా ఒక కాగితం ఈవీఎంకు అనుసంధానమై ఉన్న ఒక యంత్రం నుంచి బయటకు వస్తుంది. కానీ దాన్ని ఓటరుకు ఇవ్వరు.
►ఓటరు నమోదు కార్యక్రమం ఎన్నికలకు 10 రోజుల ముందు వరకు కొనసాగుతున్నందున మొత్తం ఓటర్ల సంఖ్య 7 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి అజయ్ వీ నాయక్ తెలిపారు. ప్రస్తుత ఓటర్లలో యువ ఓటర్లే 2.04 కోట్లమంది ఉన్నందున ఈ సారి ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో కొత్త ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు.