హైదరాబాద్: నగరంలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. యజమానికి తెలియకుండానే షోరూం సిబ్బంది బైకులను విక్రయించి ఆ నగదును నొక్కేశారు. వీటిని కొన్నవారు సదరు వాహనాలు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. షోరూం యజమాన్యం ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. టోలిచౌకిలోని హోండా బైక్స్ షోరూంలో పనిచేసే ఏడుగురు సిబ్బంది యజమానికి తెలియకుండా 27 బైకులను వినియోగదారులకు విక్రయించి వచ్చిన సొమ్మును పంచుకున్నారు. ఈ తతంగం రెండు నెలల నుంచి సాగింది. వీటిని కొన్నవారికి నకిలీ రసీదులు ఇవ్వడంతో వాటికి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కాలేదు.
దీంతో పలువురు వినియోగదారులు షోరూంకు వచ్చి సిబ్బందిని నిలదీయగా రేపుమాపు అంటూ సిబ్బంది నెట్టుకొస్తున్నారు. ఎంతకు వాహనాల రిజిస్ట్రేషన్ కాకపోవడంతో అనుమానం వచ్చిన వినియోగదారులు విషయాన్ని షోరూం యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన రికార్డులు తనిఖీ చేశారు. దీంతో బైకుల స్కాం వెలుగులో వచ్చింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు షోరూంలో పనిచేస్తున్న ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని వీరు విక్రయించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.