త్వరలో పార్లమెంట్ కు తెలంగాణ బిల్లు: ఆజాద్
కోల్కతా : తెలంగాణ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పడిన జీవోఎం తన ప్రక్రియను వేగవంతం చేసిందని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తుండటం తెలిసిందే. అయితే బిల్లు పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెడతారన్నది తెలియదని ఆజాద్ వ్యాఖ్యానించారు.
కాగా డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల ఎజెండాలో తెలంగాణ బిల్లు లేదు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా బిల్లు ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కూడా మంగళవారం లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రకటించారు