జల్సాలతో అడ్డంగా బరువెక్కిన అధ్యక్షుడు!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు, యువ నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. విందులు, వినోదాలతో నిత్యం జల్సాలు చేసే ఉన్ గత నాలుగేళ్లలో అనూహ్యంగా బరువు పెరిగిపోయాడని తెలిపింది. అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన 40 కిలోల (90 పౌండ్లు) బరువు పెరిగిపోయాడని, దీనికితోడు నిద్రలేమి వ్యాధితో ఆయన బాధపడుతున్నాడని పేర్కొంది. వ్యక్తిగత భద్రత విషయంలోనూ కింగ్ జాంగ్ ఉన్ ఒకింత అనుమానంతో ఉన్నాడని తెలిపింది. ఈమేరకు దాయాది దక్షిణకొరియాకు చెందిన జాతీయ నిఘా సంస్థ (ఎన్‌ఐఎస్) పార్లమెంటరీ కమిటీకి ఓ రహస్య నివేదిక సమర్పించింది.
2012లో తన తండ్రి చనిపోవడంతో ఆయన తదుపరి అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన కింగ్ జాంగ్ ఉన్ అప్పట్లో 90 కిలోలు ఉండేవాడని, 2014లో అతని బరువు 120 కిలోలకు చేరగా, ప్రస్తుతం అది 130 కిలోలకు చేరిందని దక్షిణ కొరియా అధికార పార్టీ ఎంపీ లీ చెవొల్ వూ ఎన్‌ఐఎస్ నివేదికను ఉటంకిస్తూ విలేకరులకు తెలిపారు. బాగా తినడం, తాగడం అలవాటు ఉన్న ఉన్‌కు పలు ఆరోగ్య సమస్యలు తలెత్త అవకాశమున్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. సైన్యం నుంచి తన అధికారానికి ఏదైనా ముప్పు ఉందనే ఆలోచనతో ఉన్ ఎప్పుడూ అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారని తెలిపారు. బాగా బరువు పెరిగిపోయిన ఉన్ నిత్యం పొగ తాగుతారని, ప్లాంట్లు, నిర్మాణాలు, పంటపొలాలు సందర్శించే సమయంలో ఆయన చేతిలో సిగరెట్ కనిపించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.