ప్రభంజనంలోనూ బీజేపీకి షాక్?
- బరిలోకి దింపిన ఐదుగురు ముస్లిం అభ్యర్థులకు చుక్కెదురు?
- ఐదుచోట్ల కాంగ్రెస్ ఘనవిజయం
- బీజేపీలో ముస్లిం నేతల పరిస్థితి ఏమిటి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించినప్పటికీ.. ఆ పార్టీ నిలబెట్టిన ఐదుగురు ముస్లిం అభ్యర్థులూ ఓటమిపాలయ్యారు. ఢిల్లీ మున్సిపాలిటీలోని 272 స్థానాలకుగాను ఐదు స్థానాల్లో బీజేపీ ముస్లిం అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. ఈ ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఐదుగురిని ఎంసీడీ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ముస్లింలకు టికెట్ ఇవ్వనప్పటికీ యూపీలో ఆయా వర్గాలు అధికంగా ఉన్న నియోజకవర్గాలను సైతం బీజేపీ గెలుచుకుంది. అందుకు భిన్నంగా ఢిల్లీలో ఐదుగురిని బరిలోకి దింపినా బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి గెలువకపోవడం గమనార్హం. జకీర్ నగర్ నుంచి కువర్ రఫీ, చౌహన్ బంగర్ నుంచి సర్తాజ్ అహ్మద్, ముస్తఫాబాద్ నుంచి సబ్రా మాలిక్, ఢిల్లీ గేట్ నుంచి ఫముద్దీన్ సఫీ, కురేష్ నగర్ నుంచి రుబినా బేగం బీజేపీ తరఫున బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ పదునైన విమర్శలతో విరుచుకుపడింది. కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాల్లో ఏదో మొక్కుబడిగా బీజేపీ ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిందని, ముస్లిం ప్రజలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్దుల్ రసూల్ ఖాన్ విమర్శించారు.
దేశవ్యాప్తంగా ముస్లింలపై మతపరమైన దాడులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఓవైపు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. మరోవైపు పేదలపై దాడులు జరుగుతున్నాయని, వారి చర్యలు ముస్లింలకు బీజేపీకి అక్కరలేదన్న సంకేతాన్ని ఇస్తున్నాయని, లౌకికవాదం, సహజీవనం ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ఆయన చెప్పారు. మరోవైపు బీజేపీకి ముస్లింలు ఓటేస్తారన్నది భ్రమేనని ఓ ఆరెస్సెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.