
‘ప్యాకేజీ’పై బీజేపీ ప్రచారం
రాష్ట్రానికి రానున్న కేంద్ర మంత్రులు.. నెలలో 3 ప్రాంతాలు.. 3 సభలు
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాకు బదులు అందుకు సమానంగా ఆర్థిక సహాయం చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించిన నేపథ్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ’ అంశాన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తోంది. రానున్న నెల రోజుల్లోగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు నిర్వహించాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయించింది. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో తిరుపతి, కోస్తాలో గుంటూరు లేదంటే విజయవాడలో ఈ సభలను నిర్వహించనున్నారు. ప్రాంతాలవారీగా జరిగే ఒక్కొక్క సభకు పార్టీకి చెందిన ఒక్కో కేంద్రమంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తారు.
విశాఖ సభకు జైట్లీ హాజరు కానున్నారని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి యడ్లపాటి రఘునాథబాబు ‘సాక్షి’కి తెలిపారు. బహిరంగసభల తేదీల్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేశాక కూడా.. ఇంకా ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ పెద్దలు ఎందుకు చెబుతున్నారో వారినే అడగాలన్నారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి ‘హోదా’ ఇచ్చే అవకాశం లేదన్నారు.