ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, మంత్రులు మాణిక్యాల, కామినేని ఇన్‌సెట్‌లో టీడీపీ చీఫ్ చంద్రబాబు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో అధికార పార్టీలు ఆడుతోన్న నాటకం మరో అంకానికి చేరింది. నిన్నటిదాకా బీజేపీతో పొత్తు వదులుకుంటామని టీడీపీ లీకులు ఇవ్వగా.. నేడు తామే ప్రభుత్వం నుంచి వైదొలగాలనుకుంటున్నట్లు ఏపీ బీజేపీ ప్రకటిచింది. విజయవాడలో ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు నాయకులు తెలిపారు.
టీడీపీతో కటీఫ్? : ప్రత్యేక హోదాకు బదులుగా ఏపీకి కేంద్రం ప్యాకేజీ ఇచ్చినప్పటికీ ఇక్కడి ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని, పైగా దోషమంతా బీజేపీ నెట్టేసే ప్రయత్నం చేస్తున్నదని సమావేశంలో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి తక్షణమే బయటికి వచ్చేయాలని, ఆ క్రమంలో ఇద్దరు మంత్రులు(మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌లు) రాజీనామాలు సమర్పించాలని తీర్మానించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్న నాయకులు.. ఈ నిర్ణయాల ఆమోదానికి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తామని పేర్కొన్నారు.
ఊరూరా సీడీలతో ప్రచారం.. : గడిచిన నాలుగేళ్లలో టీడీపీ ప్రజలకు చేసిన అన్యాయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీడీలను తయారుచేసి ఊరూరా ప్రచారం నిర్వహించనున్నారు. సీడీల రూపకల్పన కోసం ఏబీవీపీ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటుచేయనున్నారు.
హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి
విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో పార్టీ ఏపీ అధ్యక్షుడు హరిబాబుకు, నాయకుడు లక్ష్మీపతి రాజుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీరాజును మాణిక్యాల, విష్ణుకుమార్, వీర్రాజు, పురంధేశ్వరిలు సముదాయించారు. ఇదిలాఉంటే, సమావేశం ప్రారంభమైన అరగంటకే మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాంగణం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇంతకీలకమైన భేటీలో పాల్గొనకుండా పోవటమేమిటని కొందరు నాయకులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment