ఎవరి కోసం రాయల తెలంగానం!? | BJP, CPI back Telangana shutdown call | Sakshi
Sakshi News home page

ఎవరి కోసం రాయల తెలంగానం!?

Published Thu, Dec 5 2013 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

BJP, CPI back Telangana shutdown call

తెలంగాణ బంద్‌కు వెల్లువెత్తిన సంఘీభావం
 సాక్షి, హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసం పాకులాడకుండా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలపై వారు భగ్గుమంటున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు అన్నివర్గాల వరకూ పెద్దఎత్తన సంఘీభావం ప్రకటించారు.
 
టీఆర్‌ఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికేనా?: సీపీఐ
రాయల తెలంగాణ ప్రతిపాదన ఎంఐఎంను సంతృప్తిపరిచి మైనారిటీ ఓట్లు రాబ ట్టడానికా లేక టీఆర్‌ఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికా? అని సీపీఐ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదన ఎవరి మనసులో పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎవర్నీ సంతృప్తి పరచని రాయల తెలంగాణ ప్రతిపాదనతోనే ముందుకు వెళితే కాంగ్రెస్ వేళ్లు తెగడం ఖాయమన్నారు. కాగా, టీఆర్‌ఎస్, టీజేఏసీ గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు సీపీఐ సంఘీభావం ప్రకటించింది.  
 
ఎంఐఎం అడిగిందని ప్రజల ఆకాంక్షను బలిపెడతారా?: బీజేపీ
ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు.
 
తెలంగాణ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్‌ఎస్ పిలుపు మేరకు.. గురువారం తెలంగాణ బంద్ పాటిస్తున్నట్టు పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.హర్షవర్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము కూడా బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
 
‘రాయల’ వెనుక కుట్ర: పొన్నం, సారయ్య
సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తామంతా వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తామని, మిగతా రాజకీయ పార్టీలు సైతం ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.  
 
రాయలసీమను విడదీయకూడదు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నామో రాయలసీమను విడదీయకూడదని కూడా అంతే బలంగా కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో.. తెలంగాణ ప్రాంతీయ సమస్య కాదని, సామాజిక ఉద్యమ ఫలితమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గురువారం బంద్‌కు విప్లవ రచయితల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని వరవరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, అల్లం నారాయణ, ర చయిత జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
 
బంద్‌ను విజయవంతం చేస్తాం: ఆమోస్
రాయల తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని.. అందుకే టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అవసరంలేదని, పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మరో సమావేశంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement