Telangana agitators
-
TG: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(52) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.శుక్రవారం( సెప్టెంబర్6) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా చురుగ్గా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం యువతెలంగాణ పార్టీని స్థాపించి తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. అనంతర పరిణామాల్లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి సొంతగూడు బీఆర్ఎస్కు చేరారు. ఒక దశలో జిట్టాకు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. జిట్టా మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
భద్రాచలం ముమ్మాటికీ మనదే..
భద్రాచలంటౌన్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం తెలంగాణలోనిదేనని 1969 తెలంగాణ ఉద్యమకారుడు తిప్పన సిద్ధులు అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్రా సీఎం చంద్రబాబు ఎన్నికల ఉపన్యాసంలో భద్రాచలం ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిందే అంటూ ప్రసంగిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే అతనిపై ఉన్న కక్షతో, ప్రజలపై నిప్పుల వంటి మాటలను విసురుతున్నారని వాపోయారు. ఇప్పటికైన భద్రాచలం చరిత్రను తెలుసుకొని మాట్లాడటం మంచిదన్నారు. పాల్వంచ డివిజన్లో ఉండే భద్రాచలం 1959లో వరంగల్ జిల్లాలో ఖమ్మం ప్రాంతం పరిపాలన సౌలభ్యం కోసం కలసిపోవడం వలన భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మొదలగు ప్రాంతాలు పరిపాలన కోసం కాకినాడలో కలపడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా ఏర్పడిన తరువాత ఈ ప్రాంతాలను తిరిగి ఖమ్మం జిల్లాలో కలపడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వలన బ్యాక్ వాటర్ కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని 7 మండలాలను ఆంధ్రాలో కలపడం జరిగిందన్నారు. పార్లమెంట్లో ఎంపీ జైరామ్ రమేష్ తయారు చేసిన బిల్లును ఎటువంటి సర్వే చేయకుండా ఆమోదించడం వలన భద్రాచలం పక్కన ఉన్న గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచకలపాడు మొదలగు గ్రామ పంచాయతీలను కూడా కలుపుకోవడం జరిగింది. ఆనాడు హిట్లర్ తన ప్రేయసి కోసం ప్రపంచాన్ని గెలిచి ఇస్తానని, రెండో ప్రపంచ యుద్ధంలో మరణించడం జరిగింది. నీరో చక్రవర్తి రోమ్ తగలబడి పోతుంటే ఫిడేల్‌పై సంగీతాన్ని వాయించిన విధంగా చంద్రబాబు తెలంగాణ ప్రజలపై మాటల తూటాలను వదులుతున్నాడన్నారు. ఇది చంద్రబాబుకు తగదని, ఇకనైన చరిత్రను తెలుసుకొని మాట్లాడాలని 1969 తెలంగాణ ఉద్యమకారుడు తిప్పన సిద్ధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాళ్ల రవి, నలజాల శ్రీనువాసరావు పాల్గొన్నారు. -
కేసీఆర్ వల్లే పొత్తు కుదర్లేదు: డీఎస్
‘సాక్షి’తో డి.శ్రీనివాస్: కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని జేఏసీని కోరడంలో ఎలాంటి వ్యూహం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోనియా కాకుండా ఎవరున్నా తెలంగాణ ఏర్పాటు జరిగిఉండేది కాదని జేఏసీ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు. సకలజనులసమ్మె, బలిదానాలే తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర వహించాయని పేర్కొన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్ అభిప్రాయాలివి... పి.లింగం, ఎలక్షన్‌సెల్: కేసిఆర్ అధికారం కోసం ఆశ పడడం వల్లనే పొత్తు విఫలమైంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఎలాంటి షరతులు లేకుండా టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. తనకు సీఎం పదవి ఇవ్వాలనీ, టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు కేటాయించాలనిషరతు పెట్టారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించుకునే వీలుంటుంది. అధికారాన్ని ఆశించే ఆయన ఆంక్షల విధించారన్న వాదన చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు, బద్ధవిరోధులకు టికెట్లు ఇచ్చారు. అధికారం కోసం దళిత సీఎం నినాదాన్ని కూడా వదిలేశారు. టీఆర్ఎస్తో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందన్న వాదన నిజం కాదు. పొత్తు ద్వారా అనవసరమైన పోటీని నివారించవచ్చునని మాత్రమే ఆశించాం. సరైంది కాదు.. తెలంగాణ ఉద్యమకారులను అవకాశం కల్పిస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం సరైందికాదు. ముందు ప్రకటించిన నలుగురికి టికెట్లు ఇస్తేనే మంచిది. ఏఐసీసీ ప్రకటించిన తరువాత టికెట్లు ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నారు... తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందునుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసింది. అయితే మేము శాస్త్రీయంగా పనిచేశాం. సరైన వేదికలమీద ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యిందన్న నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. మూడు అంశాలే కీలకం... జేఏసీ నిర్వహించినసకలజనులసమ్మె, యువకుల బలిదానాలే తెలంగాణ కలను సాకారం చేశాయి తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదు. సకలజనుల సమ్మెలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రంలేదు. సమ్మె విజయవంతం కావడంతో చివరి నిమిషంలో టీఆర్ఎస్ అందులో పాల్గొంది. ప్రభుత్వ యంత్రాంగం స్థంభించిపోయేంత తీవ్రంగా జరిగిన సమ్మెతో ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎంతగా నష్టపోయారన్నది కేంద్రం గుర్తించింది. యువత బలిదానాలకు సోనియా చలించిపోయారు. సొంత పార్టీని ధిక్కరించి ఎంపీలు లోకసభను స్థంభింపచేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు అంశాలే తెలంగాణ రావడానికి కారణం. సభలు, విలేకరుల సమావేశాలు పెట్టడం తప్ప టీఆర్ఎస్ తెలంగాణ సాధన దిశలో చేసిందేమీ లేదు. కేసీఆర్‌కు తెలంగాణ సాధించుకోవడం కోసం కాకుండా... అధికారాన్ని దక్కించుకుకోవడానికే ఎదురుచూశారు. వాపును చూసి బలమని... 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి అది తమ బలమనుకుంటే పొరపాటు. అప్పడు కాంగ్రెస్ తెలంగాణ విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న నిరసన ఉండేది. అది టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. మరో భాగంలో ఆ పార్టీకి బలమే లేదు. సత్తా చాటుతాం.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లోకసభ స్థానాలను కూడా అధికసంఖ్యలో గెలుచుకుంటుంది. పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంది. ఒంటరిగానే సత్తా చాటుతాం. ఆ పొత్తు ప్రభావం ఉండదు... టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు అంత ప్రాధాన్యం లేదు. పొత్తు ప్రభావం ఇక్కడ ఉండదు. గతంలోనూ వారు కలిసి పోటీ చేశారు. అప్పుడెందుకు విడిపోయారో... ఇప్పుడెందుకు కలిశారో.. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యే ఉంటుంది. -
జెండా ఎత్తిన పిడికిళ్లు
రాజకీయ పార్టీల్లోకి తెలంగాణ ఉద్యమకారులు ఎన్నికల సమయంలో చేరికలపై భిన్నాభిప్రాయాలు బోరెడ్డి అయోధ్యరెడ్డి: ఉద్యమం.. రాజకీయం.. ఈ రెండూ వేరువేరు. అయితే, ఈ రెండు ఇప్పుడు కలిసిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ శక్తులకు రాజకీయ పార్టీలు ఎర్ర తివాచీలు పరుస్తుంటే.. ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. దీన్ని కొందరు స్వాగతిస్తుండగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలు సందర్భాల్లో రాజకీయ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసిన ఉద్యమ కారులు రాజకీయాల్లో చేరడం తమ పరిధిని కుంచించుకోవడ మేనని, వారు తెలంగాణ నవ నిర్మాణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రెజర్ గ్రూప్స్గానే కొనసాగాలని మరికొందరు భావిస్తున్నారు. ఉద్యమకారుల రాజకీయ రంగప్రవేశంపై అనుకూల, ప్రతికూల వాదనలు ఇలా ఉన్నాయి. అనుకూలంగా.. ఇన్నాళ్లూ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. కుల, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాలుగా జేఏసీలో భాగమై ఒక్కటిగా ఉద్యమించారు. సామాజిక, సాంస్కృతిక వివక్ష, ఆర్థిక అన్యాయం, రాజ్యాధికారంలో వాటా లేకపోవడం, విద్యా, ఉద్యోగాంశాల్లో సరైన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలు తెలంగాణ కోసం ఉద్యమించేలా చేశాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం దిశగా కృషి చేయడానికి ఉద్యమకారులు చట్టసభల్లో అడుగుపెట్టా ల్సిన అవసరం ఉంది. రాజ్యాధికా రంలో భాగస్వా ములై రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాలపై పోరాటాలు, ఇతర మార్గాల్లో ఒత్తిడిని తీసుకువచ్చే ప్రజాసం ఘాలుగా కన్నా.. రాజ్యాధికారంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రతికూలంగా.. తెలంగాణకు ఇప్పటిదాకా జరిగిన అన్యాయం సరిదిద్దడానికి ప్రభుత్వంలో లేదా ప్రజా ప్రతినిధిగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వా లపై ఒత్తిడి తీసుకురాగలిగే ప్రజాసంఘాలుగా ఉంటూ కూడా ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చు. ఎన్నికల ప్రక్రియలో భాగమైన తర్వాత పరిస్థితులు మారి పోతాయి. ఓట్ల రాజకీయంలోకి దిగిన తర్వాత ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా పనితీరు కుంచించు కుపోతుంది. పార్టీల వైఖరులతో లక్ష్యాలు పరిమి తమైపోతాయి. ఇప్పటిదాకా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేసిన ప్రజాసంఘాల నేతలు ఇప్పడు ప్రభుత్వంలోనో, ఒక పార్టీ చట్రంలోనో బందీలుగా ఉంటూ విశాల ప్రాతిపదికన అభిప్రాయాలను వెల్లడించగలరా? ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ విధానాలకు, ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించ గలరా? ప్రజలకు మేలు చేకూర్చే అంశాలపై ఇప్పటిదాకా ఉన్నంత నిష్కర్షగా ఉండగలరా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎవరెవరు? ఏయే పార్టీల్లో...? ఇవన్నీ ఎలా ఉన్నా పార్టీల నుంచి ఉద్యమ కారులకు ఆహ్వానాలు మాత్రం బాగానే వస్తున్నాయి. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ (మానకొండూర్ లేదా ఆంధోల్), విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి (వికారాబాద్ లేదా సత్తుపల్లి) టీఆర్ఎస్లో చేరారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం (చొప్పదండి) కాంగ్రెస్ పార్టీలో చేరారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంను సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించారు. సి.విఠల్ (మహేశ్వరం లేదా సంగారెడ్డి), దేవీ ప్రసాద్ (సంగారెడ్డి), అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి (రాజేందర్‌నగర్ లేదా ఇబ్రహీంపట్నం) ఘంటా చక్రపాణి (సికింద్రాబాద్ లోక్‌సభ)ని టీఆర్ఎస్ తరఫున పోటీచేయాలని కేసీఆర్ కోరారు. దిగ్విజయ్‌సింగ్, కేంద్రమంత్రి జైరాం రమేశ్‌లతో జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య సమావేశమయ్యారు. పెద్దపల్లి లోక్‌సభా స్థానం లేదా రామగుండం అసెంబ్లీ స్థానం నుండి పోటీ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. జర్నలిస్టు సంఘాల నేత శైలేష్ రెడ్డి బీజేపీలో చేరారు. పల్లె రవికుమార్ కూడా జైరాం రమేశ్‌తో చర్చిస్తున్నారు. జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాంను పార్టీలన్నీ ఏకగ్రీవంగా గెలిపించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. దీని సాధ్యాసాధ్యాలపై కొంత చర్చ జరిగిన తర్వాత అంత సులభం కాదని తేలింది. జిల్లాల జేఏసీ చైర్మన్లకు కూడా అలాంటి అవకాశం కావాలని మరికొన్ని డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని తేలడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. జిల్లాల జేఏసీల నుండి మరికొన్ని పేర్లు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. రంగరాజు (ఖమ్మం), రాజేందర్ రెడ్డి (మహబూబ్‌నగర్), గంగారాం, గోపాల శర్మ (నిజామాబాద్), అమరేందర్ రెడ్డి (నల్లగొండ) తదితరులు రాజకీయరంగంలోకి అడుగు పెడుతున్నారు. -
తెలంగాణ బంద్ సంపూర్ణం
బోసిపోయిన పది జిల్లాలు.. హోరెత్తిన నిరసనలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలన్నీ తెలంగాణవాదుల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లు కూడా బంద్ పాటించడంతో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపించాయి. రైల్వేస్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గింది. టీజేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, విద్యార్థి, ప్రజా, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు గైర్హాజరవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ వైద్యుల జేఏసీ నిరసనలతో ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్లో సోనియా ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేయగా, తెలంగాణవాదులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యేకప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. -
ఎవరి కోసం రాయల తెలంగానం!?
తెలంగాణ బంద్‌కు వెల్లువెత్తిన సంఘీభావం సాక్షి, హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసం పాకులాడకుండా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలపై వారు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు అన్నివర్గాల వరకూ పెద్దఎత్తన సంఘీభావం ప్రకటించారు. టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికేనా?: సీపీఐ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎంఐఎంను సంతృప్తిపరిచి మైనారిటీ ఓట్లు రాబ ట్టడానికా లేక టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికా? అని సీపీఐ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదన ఎవరి మనసులో పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎవర్నీ సంతృప్తి పరచని రాయల తెలంగాణ ప్రతిపాదనతోనే ముందుకు వెళితే కాంగ్రెస్ వేళ్లు తెగడం ఖాయమన్నారు. కాగా, టీఆర్ఎస్, టీజేఏసీ గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఎంఐఎం అడిగిందని ప్రజల ఆకాంక్షను బలిపెడతారా?: బీజేపీ ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పిలుపు మేరకు.. గురువారం తెలంగాణ బంద్ పాటిస్తున్నట్టు పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.హర్షవర్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము కూడా బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ‘రాయల’ వెనుక కుట్ర: పొన్నం, సారయ్య సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తామంతా వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తామని, మిగతా రాజకీయ పార్టీలు సైతం ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను విడదీయకూడదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నామో రాయలసీమను విడదీయకూడదని కూడా అంతే బలంగా కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో.. తెలంగాణ ప్రాంతీయ సమస్య కాదని, సామాజిక ఉద్యమ ఫలితమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గురువారం బంద్‌కు విప్లవ రచయితల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని వరవరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, అల్లం నారాయణ, ర చయిత జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేస్తాం: ఆమోస్ రాయల తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని.. అందుకే టీఆర్ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అవసరంలేదని, పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మరో సమావేశంలో పేర్కొన్నారు. -
‘రాయల’ రగడ..
తెలంగాణ జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై తెలంగాణ జిల్లాల్లో బుధవారం పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. టీఆర్ఎస్ పిలుపు మేరకు పది జిల్లాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, దీక్షలు జరిగారుు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద జేఏసీల నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేశారు. వరంగల్ జిల్లా మానుకోటలో తెలంగాణవాదులు రైలు పట్టాలపై బైఠాయించడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హన్మకొండలో ఎమ్మెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్, హుస్నాబాద్, గోదావరిఖని, హుస్నాబాద్, సిరిసిల్లలో కళాశాలల విద్యార్థులతో టీఆర్ఎస్ భారీర్యాలీ నిర్వహించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, ఖానాపూర్, బెల్లంపల్లి, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో నిరసనలు హోరెత్తాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాల్కొండ, బాన్సువాడ, డిచ్పల్లి, జుక్కల్‌తోపాటు 36 మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బుధవారం ర్యాలీలు నిర్వహించి, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేయగా, కోర్టు ఎదుట న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్, టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి హైవేపై రాస్తారోకో చేశారు. పీడీఎస్‌యూ (విజృంభణ) ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. చేవెళ్లలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ ఆందోళనలో పాల్గొన్నారు. మెదక్ జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
‘రాయల’ పేరిట మాయలొద్దు
ఇది విభజన ఇష్టంలేని ఆంధ్ర నేతల కుట్ర : కోదండరాం కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ హెచ్చరిక తెలంగాణ మంత్రులూ విముఖం సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటుదిశలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోందని వస్తున్న వార్తలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దీనికి తాము ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. ‘రాయల’ పేరిట మాయలకు, మోసానికి పాల్పడితే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణే తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ అంటే మరోసారి పోరాటాలకు దిగుతామని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాయల తెలంగాణ ఏర్పాటుకు సాహసిస్తే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని టీఆర్ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విభజన ఇష్టంలేని వ్యా పారులు, ఆంధ్రా నాయకులు పన్నుతున్న కుట్రలో భాగ మే రాయల తెలంగాణ అంశమని టీ-ఏజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన ముంబైలో మా ట్లాడుతూ, ఇప్పటివరకు అనేక రకాలుగా విభజనను అడ్డుకునేం దుకు ప్రయత్నించినా ఫలితం దక్కనందున రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణే తమకు సమ్మతమని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాయల తెలంగాణ ఎవరికోసం?: టీ జేఏసీ ‘రాయల తెలంగాణను ఎవరు అడిగారు?, ఎవరికోసం రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?’ అని తెలంగాణ జేఏసీ ప్రశ్నించింది. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు శనివారం జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వనరులను, ఉద్యోగాలను, నీటి హక్కులను కొల్లగొట్టడంలో రాయలసీమకు చెందిన నేతల పాత్రే ఎక్కువ అని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణకోసం మరోసారి ఉద్యమాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై కట్టిన అక్రమ ప్రాజెక్టులకు చట్టబద్దమైన నీటి కేటాయింపులకోసమే రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని అద్దంకి దయాకర్ విమర్శించారు. రాయల తెలంగాణ అంటే మరో పోరు : హరీష్‌రావు కోహీర్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వకపోతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటూ మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీరు సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారన్నారు. మాయల తెలంగాణ వద్దు : కేటీఆర్ ఎల్లారెడ్డిపేట/నిజామాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణను తెరపైకి తెస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆరోపించారు. రాయల తెలంగాణ పేరుతో మాయ చేయాలని చూస్తే ప్రజలు మరోసారి ఉద్యమ తీవ్రతను రుచిచూపిస్తారని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన హెచ్చరించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. అవసరమైతే మరోసారి ఉద్యమానికి దిగుతామన్నారు. రాయల తెలంగాణ కుట్ర: వినోద్‌కుమార్ వరంగల్ : హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. హన్మకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేయడం కన్నా తెలంగాణను ఇవ్వకపోవడమే నయమని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్ఎల్డీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు: పొన్నాల రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ వంటి వార్తలు తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాంటి ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణే వస్తుందని మంత్రి వి.సునీతారెడ్డి మెదక్‌జిల్లా హత్నూరులో స్పష్టం చేశారు. -
‘శంఖారావం’ బస్సులపై దాడి
సాక్షి నెట్వర్క్: సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి శంఖారావం సభకు వెళ్లే బస్సులను ఖమ్మం, వరంగల్ మీదుగా దారి మళ్లించారు. దాంతో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర్లోని కడిపికొండ వద్ద హైదరాబాద్ వెళ్తున్న బస్సులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కొన్ని బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడగా, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యూయి. అనంతరం పోలీసులు బస్సులను ఎస్కార్ట్ సహాయంతో హైదరాబాద్ పంపించారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట - స్టేషన్ ఘన్‌పూర్‌ల మధ్య తెలంగాణవాదు లు సమైక్య సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు బస్సులను కదలనివ్వలేదు. అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో బస్సులను వెనక్కు మళ్లించి తిరిగి వరంగల్ మీదుగా హైదరాబాద్ పంపించారు. జనగామ- సూర్యాపేట రోడ్డులో దేవరుప్పల, సింగరాజుపల్లి వద్ద కూడా ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. దేవరుప్పల వద్ద పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పోలీసులను వారించారు. ఆ తరువాత పోలీసులు పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేసి సీమాంధ్ర వాహనాలను సురక్షితంగా హైదరాబాద్‌కు పంపించారు. విద్యార్థుల ఆందోళన సమైక్య శంఖారావం సభకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీని ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు, నిజాం హాస్టల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మరికొందరు విద్యార్థులు హాస్టల్ పైనుంచి స్టేడియంలోకి రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఎల్బీ స్టేడియంలోకి దూసుకెళ్లిన పలువురు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.