తెలంగాణ బంద్ సంపూర్ణం
బోసిపోయిన పది జిల్లాలు.. హోరెత్తిన నిరసనలు
సాక్షి, నెట్‌వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలన్నీ తెలంగాణవాదుల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లు కూడా బంద్ పాటించడంతో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపించాయి. రైల్వేస్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గింది. టీజేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, విద్యార్థి, ప్రజా, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు గైర్హాజరవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది.
తెలంగాణ వైద్యుల జేఏసీ నిరసనలతో ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్‌లో సోనియా ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేయగా, తెలంగాణవాదులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యేకప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా.. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది.