రాయల తెలంగాణ అంటే యుద్ధమే | TRS calls for shutdown to oppose Rayala Telangana proposal | Sakshi
Sakshi News home page

రాయల తెలంగాణ అంటే యుద్ధమే

Published Wed, Dec 4 2013 3:46 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

TRS calls for shutdown to oppose Rayala Telangana proposal

* రేపు బంద్‌కు కేసీఆర్ పిలుపు
* తల తెగిపడ్డా.. అందుకు అంగీకరించనని టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్య
* మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ నిరసనలు
* 6న పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం
* సీడబ్ల్యూసీ, కేబినెట్‌లు నిర్ణయించింది 10 జిల్లాల తెలంగాణనే
* తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ వారి కోసమా? లేక
* అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారి కోసమా?
* దీనిపై నేను పార్లమెంటుకు హాజరై నిరసన గళం వినిపిస్తా
 
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే యుద్ధం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ వాదుల తరఫున కరాఖండిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తాజా ప్రతిపాదనకు నిరసనగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజైన ఈనెల 5వ తేదీ (గురువారం) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.

‘రాయల తెలంగాణ వద్దు - సంపూర్ణ తెలంగాణ ముద్దు’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసనలు తెలపాలని సూచించారు. కేసీఆర్ మంగళవారం తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు కె.కేశవరావు, మందా జగన్నాథం, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎస్.మధుసూదనాచారి, కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

 నాకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినయ్...
 ‘‘ఏం జరుగుతుందో తెలియనపుడు మాట్లాడుడు మంచిదికాదని ఇప్పటివరకు ఆగినం. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉందని నాకు ఢిల్లీలోని వర్గాల నుంచి ఫోన్లు వచ్చినయ్. సరైన సమయంలో స్పందించడం నా విధ్యుక్త ధర్మంగా భావించి ఇప్పుడు మాట్లాడుతున్న. ఇది తెలంగాణ ప్రజల ఆశ, భాష. తెలంగాణ ప్రజల ఆశను సరైన సమయంలో తెలుపకపోతే నాది తప్పు అయితది. అందుకే ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి, జీవోఎంకు తెలుపుతున్నం. ప్రాణాలు పోయినా, ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా రాయల తెలంగాణకు అంగీకరించం. అట్లాంటిదే జరిగితే మరో ఉద్యమానికి తెరతీస్తం’’ అని పేర్కొన్నారు.

‘‘తెలంగాణ ప్రజల తరఫున నిరసనలు తెలిపేందుకు మేం కార్యాచరణ రూపొందించినం. బుధవారం విద్యార్థులు, యువకులు రాయల తెలంగాణ వ్యతిరేక నిరసన ర్యాలీని గ్రామం నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు చేపట్టాలె. టీఆర్‌ఎస్ తరఫున గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నం. తెలంగాణకు ఇది పరీక్షా సమయం. ఈ బంద్ వేరే ఎవరి కోసమో కాదు కాబట్టి ఇందులో వ్యాపారస్తులు మొదలుకొని విద్యా సంస్థల దాకా అంతా స్వచ్ఛందంగా వంద శాతం పాల్గొనాలె. బంద్‌లో పాల్గొనాలని ఎవ్వరూ ఒత్తిడి చేయరు. స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్‌లో పాల్గొని కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలె. అందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. ఉద్యోగులు విధులను బిహ ష్కరించాలి, ఆర్టీసీ వారు, పరిశ్రమలు, ఐటీ వారు అందరూ ఇందుకు సహకరించాలె’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఆరో తేదీన టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని.. కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ బిల్లును బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ శిక్షణా కార్యక్రమలను మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు.

బలిదానాలు సంపూర్ణ తెలంగాణ కోసమే
‘‘13 ఏళ్ల తర్జనభర్జనల తర్వాత సీడబ్ల్యూసీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించింది. దాన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇపుడు దాన్ని అటు ఇటు తిప్పడం, వేరే ఏవో చేర్చడం అనేది సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఖండించటమే. ఇతర ప్రాంతాల వారితో కలిసేందుకే మా పిల్లలు బలిదానం చేసుకున్నారా? ఇవాళ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి. ఆయన అమరుడు అయింది రాయల తెలంగాణ కోసమేనా? తెలంగాణ కోసం ప్రాణత్యాగ ం చేసుకున్న వారంతా హైదరాబాద్ రాజ ధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలనే. అదే కొందరు లేఖల రూపంలోనూ తెలిపారు. ఇవన్నీ జీవోఎంకు సుమారు గంటన్నర పాటు వివరించినయన్ని అరణ్యరోదనే అయితయ? తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణవారి కోసమా లేదా అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారికోసమా? అని జీవోఎం భేటీలో మేం ప్రశ్నించినం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 హైదరాబాద్‌పై ఆంక్షలు విధిస్తారా
‘‘రాష్ట్రం విడిపోతే గతంలో తెలంగాణతో కలిసి లేని సీమాంధ్రులు తిరిగి వారి ప్రాంతానికి హ్యాపీగా వెళ్లిపోతరు. మాక్కుడా కొద్దో గొప్పో రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగంలో ఎక్కడా కామన్ కాపిటల్ అనే పదం లేకున్నా.. సీమాంధ్రులను తెల్లారే తరుముడు తెలివి తక్కువ తనం అయితదని ఒప్పుకున్నదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్‌పై, శాంతిభద్రతలు ఇతర అంశాలపై ఆంక్షలు విధిస్తర? ఇట్లాంటి చర్యలు మమ్మల్ని అవమానించుడే అయితది. మద్రాసు నుంచి విడిపోయినపుడు తెలుగువారికి రాని సమస్యలు ఇపుడు తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కలుగుతయి అనడం వితండవాదమె. కేంద్రం కట్టడి చేయడం అనే చర్య మొదలుపెడితే దేశంలో ఏ పెద్ద నగరాల్లోకి ఇతరులను రానివ్వరు. ఇప్పటికే ఉన్న 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు ఏర్పడ బోయే తెలంగాణకు మాత్రమే ఎందుకు విధిస్తరు?’’ అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో టీ ఆర్‌ఎస్ విలీనానికి అంగీకరించకపోవటం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదనలు చేస్తున్నారంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘సొల్లుగాళ్ల మాటలకు నేను జవాబివ్వాలా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అంగీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందనే అభిప్రాయాలను విలేకరులు పేర్కొనగా.. ‘‘కేసీఆర్ రాయల తెలంగాణకు ఒప్పుకుంటడ? నా జీవితంలో ఏనాడైనా ఆ మాట అడిగినన?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘రాయల తెలంగాణ నష్టాలను రోజుల తరబడి చె ప్పుకోవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి 1.5 లక్షల మంది బంగారు బతుకులు నాశనం అయినయి. రాయల తెలంగాణ ప్రకటించిన తర్వాత పది రోజుల పాటు ఉద్యమించి ఊరుకుంటారని కొందరు సన్నాసులే భావిస్తరు. కేసీఆర్ అట్ల ఊరుకుంటడ? నా తల తెగిపడ్డా అందుకు అంగీకరించను. ఇన్నాళ్ల ఉద్యమంలో మధ్యలో ఎందరో బుడ్డర్‌ఖాన్‌లు వచ్చిపోయారు తప్ప కేసీఆర్ ఒక్కడే పోరాడుతున్నడు. ఎవరి గొంతెమ్మ కోరికల కోసమో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి మా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి బిడ్డలను చంపుకోవాల్నా? ఆ రెండు జిల్లాలను కలిపి అక్కడి గాలేరు-నగరి వంటి అక్రమ ప్రాజెక్టులను ఓకే చేసుకోవాల్నా? దీనికి ఏ తెలంగాణ బిడ్డనైనా ఒప్పుకుంటడ? అసలు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకొచ్చిందో అది బయటపెట్టిన వారే చెప్పాలి. కాకి లెక్కలు చెప్పి సీమ జిల్లాలు కలుపుకుంటే కరెంటు కష్టాలుండవని చెప్తే వినేందుకు మేం పిచ్చోళ్లమా? నీటి ఆధారంగా జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎల్లకాలం ఉండదు. బొగ్గుతో తయారయ్యేదే ఎప్పటికీ శాశ్వతం. ఆ బొగ్గు మా తెలంగాణలో పుష్కలంగా ఉంది. దానితో కరెంటు తయారు చేసుకుంటం’’ అని పేర్కొన్నారు.

రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తే యుద్ధం గ్యారంటీ అని కేసీఆర్ హెచ్చరించారు. ‘‘సంపూర్ణ తెలంగాణ ప్రకటించేదాకా యుద్ధం కొనసాగిస్తం. పార్లమెంటు సమావేశాలకు తప్పక హాజరవుత. రాయల తెలంగాణ ఏర్పాటు లేదా ఇతర ఆంక్షలేమైనా ఉంటే తప్పక  నిరసన తెలుపుత. తెలపకుండా నేనెట్ల ఊరుకుంటా? ఈ సారి ఇంగ్లిష్‌లో కాదు హిందిలో మాట్లాడుత’’ అని చెప్పారు.

బంద్‌కు  టీజేఎఫ్,  ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు
రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న చేపట్టిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్), తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement