నేడు తెలంగాణ బంద్ | Telangana shutdown Today | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణ బంద్

Published Thu, Dec 5 2013 2:57 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

నేడు తెలంగాణ బంద్ - Sakshi

నేడు తెలంగాణ బంద్

* మద్దతు ప్రకటించిన పలు జేఏసీలు   
* బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్    
* అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు..  
* విజయవంతం చేయాలన్న కోదండరాం    
* ఏ కార్యాచరణకైనా సిద్ధపడాలని పిలుపు  
రాయల వద్దు.. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం   
* తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి తెలియాలి
 
 సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్ జరుగనుంది. పది తెలంగాణ జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయకుండా రాయలసీమలోని రెండు జిల్లాలను అదనంగా కలపాలన్న ప్రతిపాదనలను నిరసిస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు పలు తెలంగాణ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ బంద్‌లో పాల్గొంటామని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు బంద్ ఏర్పాట్లను టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ బుధవారం సమీక్షించారు. మండల స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సముదాయాలు, పాఠశాలలను బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
 
  రాయల తెలంగాణకు నిరసనగా, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే డిమాండ్‌తో బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఢిల్లీకి తెలిసేలా బంద్‌ను విజయంతం చేయాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ప్రజలు మెలకువగా ఉండాలన్నారు. సంపూర్ణ తెలంగాణ బిల్లులో ఏ తేడా వచ్చినా తేడా వస్తే అందుకు బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలది, రాష్ట్ర, కేంద్ర మంత్రులదేనన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం టీజేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ వద్దని, సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదం పొందాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘రెండు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపితే ప్రజలు కోరుకున్న రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదు.
 
గవర్నర్‌కు అధికారాలివ్వడం, హైదరాబాద్‌పై తెలంగాణకుండే హక్కును నీరుగార్చే ప్రయత్నాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. సంపూర్ణ తెలంగాణలో ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలకు జేఏసీ పిలుపునిస్తుంది. అవసరమైతే మళ్లీ చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. భావి కార్యచరణపై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటాం. ఏ కార్యచరణకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి’’ అని కోరారు. 371డి, యూటీ, గవర్నర్ పాలన వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణిచివేసే ఎత్తుగడలను నిరసిస్తున్నట్టు టీజేఏసీ నేత దేవీప్రసాద్ చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనకు ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణపై రాబందుల్లా కన్నేసి, రాయల తెలంగాణ అంటూ ఉద్యమాన్ని నీరుగార్చజూస్తున్న వారికి చెంపపెట్టులా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె వంటి ఆందోళనలకు వంద రెట్లు భారీగా ఉద్యమం చేపట్టి పార్టీలను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. భేటీలో తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, న్యాయవాదుల జేఏసీ నేతలు పాల్గొన్నారు.
 
నిరసన కార్యక్రమాలపై జేఏసీ చర్చ
రాయల తెలంగాణ ప్రచారంలో ఉన్నా బిల్లు మాత్రం స్పష్టంగా తెలంగాణ ఏర్పాటుపైనే ఉంటుందని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాయల తెలంగాణ, నిరసన కార్యక్రమాలపై ఢిల్లీలో కమిటీ చర్చించింది. తెలంగాణకు సానుకూల వాతావరణమే ఉందని, రాయల తెలంగాణ ఉండకపోవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ అధ్యక్షులు శరద్‌యాదవ్, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలను ఇప్పటికే జేఏసీ నేతలు కలిశారు. లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను గురువారం కలవనున్నారు. బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తదితరులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. భేటీలో మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, కె.రఘు, పిట్టల రవీందర్ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement