బస్సులకు ‘టీ’బ్రేక్ | due to the Telangana party affect buses are stopped | Sakshi
Sakshi News home page

బస్సులకు ‘టీ’బ్రేక్

Published Thu, Dec 5 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

due to the Telangana party affect buses are stopped

కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్‌ఎస్ తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో అటువైపు వెళ్లే బస్సులకు బ్రేక్ పడింది. ఆర్టీసీ అధికారులు ముందుజాగ్రత్తగా దాదాపు 185 సర్వీసులను నిలుపుదల చేసేందుకు నిర్ణయించారు.
 
 దీంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్, ఐజ, శాంతినగర్, కోదాడ, రాజోలి, కొత్తకోట, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ సర్వీసులు, లారీలు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేయడం.. లేదా కర్నూలు నుంచి వెనక్కు పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ కారణంగా రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు మీదుగా రాజధానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు.
 
 మరీ అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు దాదాపు 600 మందికి పైగా ఆన్‌లైన్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు బస్సు సర్వీసుల నిలుపుదల కారణంగా డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినా.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. వీటి ద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement