ఇది విభజన ఇష్టంలేని ఆంధ్ర నేతల కుట్ర : కోదండరాం
కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ హెచ్చరిక
తెలంగాణ మంత్రులూ విముఖం
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటుదిశలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోందని వస్తున్న వార్తలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. దీనికి తాము ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోబోమని తెగేసి చెబుతున్నారు. ‘రాయల’ పేరిట మాయలకు, మోసానికి పాల్పడితే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణే తమకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ అంటే మరోసారి పోరాటాలకు దిగుతామని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం రాయల తెలంగాణ ఏర్పాటుకు సాహసిస్తే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విభజన ఇష్టంలేని వ్యా పారులు, ఆంధ్రా నాయకులు పన్నుతున్న కుట్రలో భాగ మే రాయల తెలంగాణ అంశమని టీ-ఏజేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం ఆయన ముంబైలో మా ట్లాడుతూ, ఇప్పటివరకు అనేక రకాలుగా విభజనను అడ్డుకునేం దుకు ప్రయత్నించినా ఫలితం దక్కనందున రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాల తెలంగాణే తమకు సమ్మతమని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రాయల తెలంగాణ ఎవరికోసం?: టీ జేఏసీ
‘రాయల తెలంగాణను ఎవరు అడిగారు?, ఎవరికోసం రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?’ అని తెలంగాణ జేఏసీ ప్రశ్నించింది. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, అడ్వొకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి తదితరులు శనివారం జేఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వనరులను, ఉద్యోగాలను, నీటి హక్కులను కొల్లగొట్టడంలో రాయలసీమకు చెందిన నేతల పాత్రే ఎక్కువ అని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణకోసం మరోసారి ఉద్యమాలు జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నదా అని ప్రశ్నించారు. కృష్ణా నదిపై కట్టిన అక్రమ ప్రాజెక్టులకు చట్టబద్దమైన నీటి కేటాయింపులకోసమే రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని అద్దంకి దయాకర్ విమర్శించారు.
రాయల తెలంగాణ అంటే మరో పోరు : హరీష్‌రావు
కోహీర్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇవ్వకపోతే మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో ఆయన మాట్లాడుతూ, రాయల తెలంగాణకు ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ అంటూ మరో ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారని, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులకు నీరు సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారన్నారు.
మాయల తెలంగాణ వద్దు : కేటీఆర్
ఎల్లారెడ్డిపేట/నిజామాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునే కుట్రలో భాగంగానే రాయల తెలంగాణను తెరపైకి తెస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆరోపించారు. రాయల తెలంగాణ పేరుతో మాయ చేయాలని చూస్తే ప్రజలు మరోసారి ఉద్యమ తీవ్రతను రుచిచూపిస్తారని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన హెచ్చరించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. అవసరమైతే మరోసారి ఉద్యమానికి దిగుతామన్నారు.
రాయల తెలంగాణ కుట్ర: వినోద్‌కుమార్
వరంగల్ : హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం తప్ప దేనికీ ఒప్పుకునే ప్రసక్తి లేదని టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. హన్మకొండలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాయలసీమను విభజించి రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని అన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేయడం కన్నా తెలంగాణను ఇవ్వకపోవడమే నయమని ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ అన్నారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎల్‌డీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రతిపాదనను తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఒప్పుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు: పొన్నాల
రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ వంటి వార్తలు తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాంటి ప్రతిపాదనలను తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణే వస్తుందని మంత్రి వి.సునీతారెడ్డి మెదక్‌జిల్లా హత్నూరులో స్పష్టం చేశారు.