జెండా ఎత్తిన పిడికిళ్లు | Telangana agitators ready to enter Politics | Sakshi
Sakshi News home page

జెండా ఎత్తిన పిడికిళ్లు

Published Tue, Mar 25 2014 1:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

జెండా ఎత్తిన పిడికిళ్లు - Sakshi

జెండా ఎత్తిన పిడికిళ్లు

రాజకీయ పార్టీల్లోకి తెలంగాణ ఉద్యమకారులు
ఎన్నికల సమయంలో చేరికలపై భిన్నాభిప్రాయాలు

బోరెడ్డి అయోధ్యరెడ్డి:  ఉద్యమం.. రాజకీయం.. ఈ రెండూ వేరువేరు.  అయితే, ఈ రెండు ఇప్పుడు కలిసిపోతున్నాయి. తెలంగాణ ఉద్యమ శక్తులకు రాజకీయ పార్టీలు ఎర్ర తివాచీలు పరుస్తుంటే.. ఉద్యోగ, ప్రజా సంఘాల నేతలు పార్టీ కండువాలు కప్పుకుని ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. దీన్ని కొందరు స్వాగతిస్తుండగా.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలు సందర్భాల్లో రాజకీయ నాయకత్వానికి దిశా నిర్దేశం చేసిన ఉద్యమ కారులు రాజకీయాల్లో చేరడం తమ పరిధిని కుంచించుకోవడ మేనని, వారు తెలంగాణ నవ నిర్మాణంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రెజర్ గ్రూప్స్‌గానే కొనసాగాలని మరికొందరు భావిస్తున్నారు. ఉద్యమకారుల రాజకీయ రంగప్రవేశంపై అనుకూల, ప్రతికూల వాదనలు ఇలా ఉన్నాయి.
 
 అనుకూలంగా..
 ఇన్నాళ్లూ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. కుల, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాలుగా జేఏసీలో భాగమై ఒక్కటిగా ఉద్యమించారు. సామాజిక, సాంస్కృతిక వివక్ష, ఆర్థిక అన్యాయం, రాజ్యాధికారంలో వాటా లేకపోవడం, విద్యా, ఉద్యోగాంశాల్లో సరైన అవకాశాలు లేకపోవడం వంటి కారణాలు తెలంగాణ కోసం ఉద్యమించేలా చేశాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల పరిష్కారం కోసం, సామాజిక న్యాయం దిశగా కృషి చేయడానికి ఉద్యమకారులు చట్టసభల్లో అడుగుపెట్టా ల్సిన అవసరం ఉంది. రాజ్యాధికా రంలో భాగస్వా ములై రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాలపై పోరాటాలు, ఇతర మార్గాల్లో ఒత్తిడిని తీసుకువచ్చే ప్రజాసం ఘాలుగా కన్నా.. రాజ్యాధికారంలో ఉన్న వారికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి.
 
 ప్రతికూలంగా..
 తెలంగాణకు ఇప్పటిదాకా జరిగిన అన్యాయం సరిదిద్దడానికి ప్రభుత్వంలో లేదా ప్రజా ప్రతినిధిగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వా లపై ఒత్తిడి తీసుకురాగలిగే ప్రజాసంఘాలుగా ఉంటూ కూడా ఆశించిన ఫలితాలను రాబట్టవచ్చు. ఎన్నికల ప్రక్రియలో భాగమైన తర్వాత పరిస్థితులు మారి పోతాయి. ఓట్ల రాజకీయంలోకి దిగిన తర్వాత ఓట్లు సంపాదించడమే లక్ష్యంగా పనితీరు కుంచించు కుపోతుంది. పార్టీల వైఖరులతో లక్ష్యాలు పరిమి తమైపోతాయి. ఇప్పటిదాకా అన్ని పార్టీలతో కలిసి ఉద్యమం చేసిన ప్రజాసంఘాల నేతలు ఇప్పడు ప్రభుత్వంలోనో, ఒక పార్టీ చట్రంలోనో బందీలుగా ఉంటూ విశాల ప్రాతిపదికన అభిప్రాయాలను వెల్లడించగలరా? ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఆ పార్టీ విధానాలకు, ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించ గలరా? ప్రజలకు మేలు చేకూర్చే అంశాలపై ఇప్పటిదాకా ఉన్నంత నిష్కర్షగా ఉండగలరా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.


 ఎవరెవరు? ఏయే పార్టీల్లో...?
 ఇవన్నీ ఎలా ఉన్నా పార్టీల నుంచి ఉద్యమ కారులకు ఆహ్వానాలు మాత్రం బాగానే వస్తున్నాయి. జేఏసీ కో చైర్మన్ వి.శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్‌నగర్), తెలంగాణ ధూంధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ (మానకొండూర్ లేదా ఆంధోల్),  విద్యార్థి జేఏసీ నేత పిడమర్తి రవి (వికారాబాద్ లేదా సత్తుపల్లి) టీఆర్‌ఎస్‌లో చేరారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (తుంగతుర్తి), ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం (చొప్పదండి) కాంగ్రెస్ పార్టీలో చేరారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంను సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయాల్సిందిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  ఆహ్వానించారు. సి.విఠల్ (మహేశ్వరం లేదా సంగారెడ్డి), దేవీ ప్రసాద్ (సంగారెడ్డి), అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి (రాజేందర్‌నగర్ లేదా ఇబ్రహీంపట్నం)  ఘంటా చక్రపాణి (సికింద్రాబాద్ లోక్‌సభ)ని టీఆర్‌ఎస్ తరఫున పోటీచేయాలని కేసీఆర్ కోరారు. దిగ్విజయ్‌సింగ్, కేంద్రమంత్రి జైరాం రమేశ్‌లతో జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య సమావేశమయ్యారు.
 
  పెద్దపల్లి లోక్‌సభా స్థానం లేదా రామగుండం అసెంబ్లీ స్థానం నుండి పోటీ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. జర్నలిస్టు సంఘాల నేత శైలేష్ రెడ్డి బీజేపీలో చేరారు. పల్లె రవికుమార్ కూడా జైరాం రమేశ్‌తో చర్చిస్తున్నారు. జేఏసీ చైర్మన్‌గా ఉన్న కోదండరాంను పార్టీలన్నీ ఏకగ్రీవంగా గెలిపించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. దీని సాధ్యాసాధ్యాలపై కొంత చర్చ జరిగిన తర్వాత అంత సులభం కాదని తేలింది. జిల్లాల జేఏసీ చైర్మన్లకు కూడా అలాంటి అవకాశం కావాలని మరికొన్ని డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని తేలడంతో ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. జిల్లాల జేఏసీల నుండి మరికొన్ని పేర్లు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. రంగరాజు (ఖమ్మం), రాజేందర్ రెడ్డి (మహబూబ్‌నగర్), గంగారాం, గోపాల శర్మ (నిజామాబాద్), అమరేందర్ రెడ్డి (నల్లగొండ) తదితరులు రాజకీయరంగంలోకి అడుగు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement