సాక్షి నెట్‌వర్క్: సమైక్య శంఖారావం సభకు వస్తున్న బస్సులను తెలంగాణలోని పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భారీ వర్షాల వల్ల వాగులు పొంగి పొర్లుతుండడంతో ఆంధ్రా ప్రాంతం నుంచి శంఖారావం సభకు వెళ్లే బస్సులను ఖమ్మం, వరంగల్ మీదుగా దారి మళ్లించారు. దాంతో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర్లోని కడిపికొండ వద్ద హైదరాబాద్ వెళ్తున్న బస్సులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దాడిలో కొన్ని బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడగా, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యూయి.
అనంతరం పోలీసులు బస్సులను ఎస్కార్ట్ సహాయంతో హైదరాబాద్ పంపించారు. దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట - స్టేషన్ ఘన్‌పూర్‌ల మధ్య తెలంగాణవాదు లు సమైక్య సభకు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు బస్సులను కదలనివ్వలేదు. అనంతరం పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో బస్సులను వెనక్కు మళ్లించి తిరిగి వరంగల్ మీదుగా హైదరాబాద్ పంపించారు. జనగామ- సూర్యాపేట రోడ్డులో దేవరుప్పల, సింగరాజుపల్లి వద్ద కూడా ఆందోళనకారులు బస్సులను అడ్డుకున్నారు. దేవరుప్పల వద్ద పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పోలీసులను వారించారు. ఆ తరువాత పోలీసులు పలువురు తెలంగాణ వాదులను అరెస్ట్ చేసి సీమాంధ్ర వాహనాలను సురక్షితంగా హైదరాబాద్‌కు పంపించారు.
విద్యార్థుల ఆందోళన
సమైక్య శంఖారావం సభకు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ప్రారంభించిన బైక్ ర్యాలీని ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు, నిజాం హాస్టల్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఆయన దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మరికొందరు విద్యార్థులు హాస్టల్ పైనుంచి స్టేడియంలోకి రాళ్లు రువ్వడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఎల్బీ స్టేడియంలోకి దూసుకెళ్లిన పలువురు ఓయూ విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
‘శంఖారావం’ బస్సులపై దాడి
Published Sun, Oct 27 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement