కేసీఆర్ వల్లే పొత్తు కుదర్లేదు: డీఎస్
‘సాక్షి’తో డి.శ్రీనివాస్: కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని జేఏసీని కోరడంలో ఎలాంటి వ్యూహం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోనియా కాకుండా ఎవరున్నా తెలంగాణ ఏర్పాటు జరిగిఉండేది కాదని జేఏసీ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు. సకలజనులసమ్మె, బలిదానాలే తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర వహించాయని పేర్కొన్నారు. కేసీఆర్ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ‘సాక్షి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎస్ అభిప్రాయాలివి...
పి.లింగం, ఎలక్షన్‌సెల్: కేసిఆర్ అధికారం కోసం ఆశ పడడం వల్లనే పొత్తు విఫలమైంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తే ఎలాంటి షరతులు లేకుండా టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అనేక సార్లు ప్రకటించారు. తనకు సీఎం పదవి ఇవ్వాలనీ, టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించాలనిషరతు పెట్టారు. ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సవరించుకునే వీలుంటుంది. అధికారాన్ని ఆశించే ఆయన ఆంక్షల విధించారన్న వాదన చేస్తున్నారు. తెలంగాణ ద్రోహులకు, బద్ధవిరోధులకు టికెట్లు ఇచ్చారు. అధికారం కోసం దళిత సీఎం నినాదాన్ని కూడా వదిలేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడిందన్న వాదన నిజం కాదు. పొత్తు ద్వారా అనవసరమైన పోటీని నివారించవచ్చునని మాత్రమే ఆశించాం.
సరైంది కాదు..
తెలంగాణ ఉద్యమకారులను అవకాశం కల్పిస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం సరైందికాదు. ముందు ప్రకటించిన నలుగురికి టికెట్లు ఇస్తేనే మంచిది. ఏఐసీసీ ప్రకటించిన తరువాత టికెట్లు ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి.
ప్రజలు మమ్మల్నే నమ్ముతున్నారు...
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడక ముందునుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసింది. అయితే మేము శాస్త్రీయంగా పనిచేశాం. సరైన వేదికలమీద ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యిందన్న నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తుంది.
మూడు అంశాలే కీలకం...
జేఏసీ నిర్వహించినసకలజనులసమ్మె, యువకుల బలిదానాలే తెలంగాణ కలను సాకారం చేశాయి తప్ప టీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు. సకలజనుల సమ్మెలో టీఆర్‌ఎస్ పాత్ర ఏమాత్రంలేదు. సమ్మె విజయవంతం కావడంతో చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ అందులో పాల్గొంది. ప్రభుత్వ యంత్రాంగం స్థంభించిపోయేంత తీవ్రంగా జరిగిన సమ్మెతో ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగులు ఎంతగా నష్టపోయారన్నది కేంద్రం గుర్తించింది. యువత బలిదానాలకు సోనియా చలించిపోయారు. సొంత పార్టీని ధిక్కరించి ఎంపీలు లోకసభను స్థంభింపచేయడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు అంశాలే తెలంగాణ రావడానికి కారణం. సభలు, విలేకరుల సమావేశాలు పెట్టడం తప్ప టీఆర్‌ఎస్ తెలంగాణ సాధన దిశలో చేసిందేమీ లేదు. కేసీఆర్‌కు తెలంగాణ సాధించుకోవడం కోసం కాకుండా... అధికారాన్ని దక్కించుకుకోవడానికే ఎదురుచూశారు.
వాపును చూసి బలమని...
2009 తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను చూసి అది తమ బలమనుకుంటే పొరపాటు. అప్పడు కాంగ్రెస్ తెలంగాణ విషయంలో మాట నిలబెట్టుకోలేదన్న నిరసన ఉండేది. అది టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. మరో భాగంలో ఆ పార్టీకి బలమే లేదు.
సత్తా చాటుతాం..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజారిటీతో విజయం సాధిస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. లోకసభ స్థానాలను కూడా అధికసంఖ్యలో గెలుచుకుంటుంది. పార్టీ తెలంగాణలో పటిష్టంగా ఉంది. ఒంటరిగానే సత్తా చాటుతాం.
ఆ పొత్తు ప్రభావం ఉండదు...
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుకు అంత ప్రాధాన్యం లేదు. పొత్తు ప్రభావం ఇక్కడ ఉండదు. గతంలోనూ వారు కలిసి పోటీ చేశారు. అప్పుడెందుకు విడిపోయారో... ఇప్పుడెందుకు కలిశారో.. తెలంగాణలో పోటీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే ఉంటుంది.