జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ | Telangana culture: Suddala Ashok teja gives interview with Sakshi | Sakshi
Sakshi News home page

జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ

Published Fri, Apr 11 2014 2:13 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ - Sakshi

జానపదానికి గ్లామర్ రావాలి: అశోక్‌తేజ

-    యాస అమ్మలాంటిది... నల్లగా ఉందని అమ్మని తరిమేస్తామా?
 -    మట్టి చరిత్రను ఆవిష్కరిస్తేనే ఆవిర్భావానికి అర్థం
 -    ఊరూవాడా వీధులన్నింటికీ త్యాగధనుల పేర్లు పెట్టాలి
 -    సాక్షికి సుద్దాల అశోక్‌తేజ ఇంటర్వ్యూ...  

 
 మన కల్చర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి... మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి.. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి..
 
బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: పుష్కరాలను ఎలా నిర్వహిస్తారో సమ్మక్క సారక్క జాతరను కూడా అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. బతుకమ్మ, బోనాల పండుగలు కూడా తెలంగాణ సంస్కృతికి ఐకా న్ వంటివి. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించి ఘనంగా నిర్వహించాలి. తెలంగాణలో జాన పదం ఎక్కువగా ఉంటుంది. ఆట-పాట- మాట ఎవరికివారే రాసుకొని ట్యూన్ చేసుకుని ఆడుతూ పాడతారు. వీరినే వాగ్గేయకారులం టారు. వీటిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర జానపద సాంస్కృతిక అకాడమీని ఏర్పాటు చేయాలి. ఆ రంగంలో కృషిచేస్తున్న వారిని ఏడాదికి నాలుగుసార్లకు తగ్గకుండా కార్య క్రమాలను రూపకల్పన చేయాలి. అన్నమయ్య పీఠంలా జానపద పీఠాన్ని ఏర్పాటు చేయాలి. వృత్తికళాకారులను చేరదీయాలి. వారికి వేతనాలు ఇవ్వాలి. గౌరవ పారితోషకాలు అందజేయాలి. కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. సినిమాకు ఇస్తున్న ప్రాధాన్యంలో 25 శాతం వీటికి అన్ని ఛానళ్లలో ప్రాముఖ్యం ఇవ్వాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. అప్పుడుగానీ వీటికి గ్లామర్ రాదు.
 
 ప్రభుత్వం ఆదరిస్తే జానపద కళలకు కూడా గ్లామర్ వస్తుంది. ఒక రంగాన్ని పెంచిపోషి ంచాలంటే ముందుగా దాన్ని ఫోకస్‌లోకి తీసుకురావాలి. గ్లామర్ ఇవ్వాలి. టీఆర్‌ఎస్ ఉద్యమంతో వేలాదిమంది కళాకారులు పుట్టుకొచ్చారు. అలాగే కొన్ని టీవీల్లో జానపద కళారూపాలను ప్రదర్శించడం వల్ల ఆ కళాకారులకు గ్లామర్ పెరిగింది. అనేకమంది అమెరికా వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇచ్చారు. పాలకుర్తి సోమనాథుడు, పోతన, వేముల వాడ భీమకవి పేరుమీద పరిశోధనాలయాలు నిర్మించా లి.  వారి పేర్లతో కళాపీఠాలు ఏర్పాటు చేయాలి. సుద్దాల హన్మంతు పేరుతోనూ కళాపీఠం ఏర్పాటు చేయాలి. కొమురం భీం, చాకలి ఐలమ్మ పేర్లమీద జిల్లాల్లో స్మారక మందిరాలు నిర్మించాలి.  
 
 తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారు, తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన వారి విగ్రహాలను ప్రతిష్టించాలి. వీధులకు, గ్రామాలకు, కూడళ్లకు వారి పేర్లు పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నేటితరానికి తెలియనే తెలియదు. దాన్ని సిలబస్‌లో పెట్టాలి. అమెరికాకు వెళ్లి వివేకానందుడు ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. అతను ఉపన్యాసం ఇచ్చిన హాలును జ్ఞాపకార్థంగా పర్యాటక క్షేత్రంగా అమెరికా ప్రభుత్వం ఉంచి గౌరవిస్తోంది. దాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. పరాయి దేశ వ్యక్తిని ఒక అగ్రరాజ్యం అలా గుర్తించినప్పుడు మన వీరులను మనం ఎందుకు గుర్తుంచుకోకూడదు? వరంగల్ జిల్లాలో బైరాన్‌పల్లిలో మరో జలియన్‌వాలాబాగ్ వంటి సంఘటన జరిగింది. వందల మంది తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా అక్కడ చనిపోయా రు. ఈ విషయం ఎందరికి తెలుసు?
 
 తెలంగాణ వంటకాలను హోంసైన్స్‌లో పాఠ్యాంశాలు చేయాలి...
 తెలంగాణలో శిలాశాసనాలను వెతికి పట్టుకుని వాటిని గ్రంథాలుగా చేయాలి. పుస్తకాలు, సీడీలుగా మార్చాలి. తాళపత్ర గ్రంథాలను సీడీలుగా మార్చాలి. వెబ్‌సైట్లలో పెట్టాలి. వందలాదిగా ఉన్న ప్రజల ఆచారాలను బయటకు తీయాలి. జొన్న, సజ్జ రొట్టెలకు ఉన్న విలువెంతో తెలుసా? పచ్చి పులుసు, అరిసెలు, గారెలు వంటివాటిని తెలంగాణ సృష్టించింది. వాటిలో ఉన్న ఆరోగ్య రహస్యాలను హోంసైన్స్‌లో సిలబస్‌గా పెట్టాలి. కల్చర్ అంటే మనం వేసుకునే బట్టలు, మనం నివసించే ఇళ్లు, మన ఆహారం, మన కళలు, మన భాష, మన సాహిత్యం, మన వ్యవసాయం, దాన్ని కాపాడుకునే విధానం, ఒక పద్ధతి కలిస్తేనే కల్చర్. దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మన పూర్వీకులను కన్నీళ్లతో పునశ్చరణ చేసుకోవాలి. నిన్నటి సంస్కృతి దీపాలను రేపటి పౌరులకు అందజేయాలి.
 
 యాసను కాపాడుకోవాలి...
 తెలంగాణ మాట్లాడే విధానంలోని యాసల సోయగాన్ని సొంపులను పట్టుకొని కాపాడుకోవాలి. యాసను వెక్కిరించొద్దు. యాస అమ్మలాంటిది. అమ్మ నల్లగా ఉందని వెళ్లగొడతామా? యాసలోని సొంపు సోయగాలను సీడీలుగా మార్చాలి. గిరిజన సంస్కృతిని కాపాడుకోవాలి. వాటిని ధ్వంసం చేయొద్దు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడమంటే సీఎం పదవి తెలంగాణ వారికి రావడమేనా? గద్దెల మీద మనుషులను మార్చడం కాదు.
 
 తెలంగాణ మట్టి చరిత్రను ఆవిష్కరించాలి. అధికార మార్పిడి కాదు కావాల్సింది. సినిమా రంగం తెలుగు సంస్కృతికి దూరమైంది. సహజత్వానికి దూరమైంది. తెలుగు అనుబంధాలకు ఇంకా దూరమైంది. పురిటి నొప్పులను కూడా సెక్సీగా చూపించే దుస్థితి సినిమాల్లో దాపురించింది. తెలంగాణ కళాకారులను సినిమా రంగంవైపు ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌లో శిక్షణ ఇవ్వాలి. అందుకు ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. బాలచందర్, గిరీష్‌కర్నాడ్ వంటి వారిని తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాలి. ఈ పనిని ప్రభుత్వమే చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement