* వైఎస్ మాదిరే జగన్ బాబు ప్రజల నమ్మకం చూరగొన్నాడు
* బాధ మనకే పరిమితమని, బాధ్యత మరవొద్దని అన్నాడు
* అప్పుడు నాకు జగన్‌లో రాజశేఖరరెడ్డి గారు కన్పించారు
* మామగారు పోయినప్పుడు వైఎస్ కూడా అవే మాటలన్నారు
* ఆయన ఉండగా నేను ఏనాడూ రాజకీయాల్లోకి రాలేదు
* వైఎస్‌కు తెలిసింది ఇవ్వడమే, పంచడమే
ఇంటర్వ్యూ: వైఎస్ విజయమ్మ:-
లక్కింశెట్టి శ్రీనివాస్, కాకినాడ: రాష్ట్రానికి దశను, దిశను నిర్దేశించే మహాసంగ్రామం జరుగుతోంది. వైఎస్ ఉండగా ఏనాడూ రాజకీయాల వైపు కన్నెత్తి చూడని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ ఇప్పుడు మండుటెండల్లోనూ ఊరూ వాడా ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. ప్రత్యర్థులపై పదునైన వాగ్బాణాలు సంధిస్తూ, వైఎస్ సువర్ణయుగాన్ని ప్రజలకు గుర్తు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ రాజన్న రాజ్యం అతి త్వరలో వైఎస్ జగన్ సారథ్యంలో మళ్లీ రాబోతోందంటూ భరోసా ఇస్తున్నారు. తాను ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, పాలకుల తీరుతెన్నులు, తమ పార్టీ లక్ష్యం తదితరాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోభావాలను పంచుకున్నారు...
- నా వరకు రాజశేఖరరెడ్డిగారు లేని లోటును ఎవరూ తీర్చలేరు. నా కొడుకు, కూతురు కూడా తీర్చలేరు. అది నేను చస్తే గానీ తీరదు. అందువల్లే ప్రజలకు కూడా అదేమాట చెబుతున్నాను. విధి లేని పరిస్థితుల్లో నేనున్నాను. ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నా. వైఎస్ లోటును ప్రజలకు జగన్‌బాబు తీరుస్తాడు.
- ‘‘రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు గోదావరి జిల్లాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పటికి ఎలక్షన్ ఐదు రోజులుంది. రాజశేఖరరెడ్డి గారు అక్కడకు పోవాల్సిన అవసరముంది. ఆయన పోతానంటే అందరూ వద్దన్నారు. నేను కూడా వద్దన్నాను, మూడోరోజే ఎందుకని. అప్పుడు, ‘బాధ మనకు పరిమితం.. బాధ్యతలు మర్చిపోకూడదు’ అని రాజశేఖరరెడ్డి అన్నారు. అవే మాటలు జగన్‌బాబు కూడా చెప్పడంతో నిజంగా తనలో వారి నాయన కనిపించాడు నాకు’’
నాలుగున్నరేళ్లుగా మీరు, జగన్, షర్మిల ప్రజల మధ్యే ఉంటున్నారు. మరి పిల్లలను మిస్ అవుతున్నామని బాధ లేదా? రాజశేఖరరెడ్డిగారు ఎప్పుడూ చెప్పేవారు. ఎన్నాళ్లు బతికామన్నది కాదు. ఎలా బతికామన్నదే ముఖ్యం. మాట తప్పడమంటే ప్రాణం పోవడంతో సమానం. మనం మనకోసం కొంతవరకే బతకాలి. పదిమంది కోసం బతకాలి. వీలైతే బంధువుల కోసం, గ్రామం కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం బతకాలి. అలా మనం అందరితో మన అభిమానాన్ని విస్తరించుకోవాలని రాజశేఖరరెడ్డి గారు చెప్పేవారు. 37 సంవత్సరాల ఆయన సాహచర్యంలో ఆయన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. బాధ్యతతో చేయాలి కాబట్టి ఆయన మాటలను గుర్తు తెచ్చుకుని ఇలా ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. పిల్లలను వదిలి ఉండడం నిజంగా చాలా కష్టం. కానీ ప్రజలకు నల్లకాల్వలో జగన్‌బాబు ఇచ్చిన మాట కోసం తప్పదు.
జగన్‌ను 16 నెలలు జైలుపాలు చేసినప్పుడు ఒక పక్క పార్టీని, మరొక పక్క కుటుంబాన్ని ఎలా నడిపించగలిగారు?
రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు నేనసలు ఏ రోజూ రాజకీయాలు పట్టించుకోలేదు. ఆ రోజు నా అవసరం కూడా లేదు. ఆయన్ను, పిల్లలను చూసుకుంటే చాలనుకున్నట్టుగా ఉండేదాన్ని. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రార్థనలు మాత్రం చేసేదాన్ని. టీవీల్లో నెగటివ్‌గా ఏదైనా వస్తే రాజశేఖరరెడ్డి గారితో చెప్పేదాన్ని. ఆయన కలెక్టర్లకు ఫోన్లు చేసి రెక్టిఫై చేసుకొమ్మని చెప్పేవారు. రాజశేఖరరెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత జగన్‌బాబు ఓదార్పు యాత్ర చేసినంత కాలం నేను ఏ రోజూ బయటకు రాలేదు. పెద్దగా రాజకీయాలు పట్టించుకోలేదు. కానీ ఉప ఎన్నిక ఉందనే జగన్‌బాబును అన్యాయంగా జైలుకు పంపించారు.
కానీ ఆ ఎన్నికల్లో జగన్‌బాబు ఒక్కటే చెప్పాడు. మనల్ని నమ్మి 17 మంది ఎమ్మెల్యేలు బయటకొస్తున్నారు. వారిని గెలిపించాలని అన్నాడు. కానీ నేను పోగలుగుతానా అని జగన్‌బాబును అడిగాను. ‘బాధ మనకే పరిమితం. కానీ బాధ్యత మర్చిపోకూడదు. మనం గెలిపించాలి’ అని చెప్పాడు. ఈ మాటలు వాళ్ల నాన్న ఎప్పుడూ నాకు చెప్పేవారు. ఆ రోజు రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు గోదావరి జిల్లాల్లో ఉప ఎన్నిక జరుగుతోంది. అప్పటికి ఎలక్షన్ ఐదు రోజులుంది. రాజశేఖరరెడ్డి గారు అక్కడకు పోవాల్సిన అవసరముంది. ఆయన పోతానంటే అందరూ వద్దన్నారు. నేను కూడా వద్దన్నాను, మూడోరోజే ఎందుకని. అప్పుడు, ‘బాధ మనకు పరిమితం.. బాధ్యతలు మర్చిపోకూడదు’ అని రాజశేఖరరెడ్డి అన్నారు. సరిగ్గా అవే మాటలు జగన్‌బాబు కూడా చెప్పడంతో నిజంగా తనలో వారి నాయన కనిపించాడు నాకు.
బాధ్యతలు మర్చిపోకూడదనుకుంటూ ప్రార్థన చేసుకొనేదాన్ని. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీకి దశ, దిశ నిర్దేశం చేస్తూ, ‘ఇది చేయండి.. అది చేయండి’ అని చెప్పేవాడు. తను వచ్చేవరకు ఒకటే అనుకున్నాను. రాజశేఖరెడ్డి గారు 30 సంవత్సరాలు కష్టపడి ఇంతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జగన్‌బాబు కూడా రెండేళ్లు కష్టపడి దానిని నిలుపుకున్నాడు. వాళ్ల నాయన లాగే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో కలిగించాడు. సమస్యలు సృష్టించుకోలేదు కానీ సమస్యలు వచ్చాయి. ఓదార్పు యాత్ర చేస్తూనే ప్రతి సమస్యకూ స్పందించాడు. విద్యార్థుల కోసం, రైతులకు మద్దతు ధర కోసం, నేతన్నల కోసం, వ్యాట్ పెంచినప్పుడు... ప్రజలకు కష్టమొచ్చిన ప్రతిసారీ పోరాటాలు చేశాడు. ఢిల్లీలో జలదీక్ష మొదలుకుని ఎన్నెన్నో. తనపై ప్రజల్లో నమ్మకం కలిగించుకోగలిగాడు. రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేరుస్తాడనే నమ్మకం కలిగించాడు.
రాజశేఖరరెడ్డి గారు నమ్మిన నాయకులు ప్రజల వెంట లేకుండా పోయినప్పుడు మీకు ఏమనిపించింది?
కొందరు నాయకులను చూస్తే నాకనిపించేది వీరంతా రాజశేఖరరెడ్డి కొలీగ్సేనా అని. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీరిలో ఒక్కరికి కూడా బాధ లేదా? ప్రజలు బాధపడుతుంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఏ పనులూ చేయడం లేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు బడ్జెట్ కూడా తక్కువ ఉండేది. రూ.37 వేల కోట్ల బడ్జెట్‌లో రూ.26 వేల కోట్ల ఆదాయం మాత్రమే ఉండేది. మిగతాది కేంద్రం నుంచి వచ్చేది. ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ లక్ష ఆరు వేల కోట్ల రూపాయలకు పెంచి అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేసి చూపించారు రాజశేఖరరెడ్డి. కిరణ్‌కుమార్‌రెడ్డి లాస్ట్ బడ్జెట్ లక్ష 85 వేల కోట్లో, ఎంతో పెట్టారు.
మరి ఏం చేస్తున్నారని చాలా బాధనిపించేది. మళ్లీ రాజశేఖరరెడ్డి రాజ్యం రావాలి. ఆయన ఆశయాలన్నింటినీ జగన్‌బాబు నెరవేరుస్తాడని కేవలం పట్టుదలతో బయట తిరిగాను. జగన్‌బాబు బయటకు వచ్చిన తరువాత, ‘నాపై బాధ్యతలు ఇంక చాలు. నువ్వొచ్చావు కదా. గౌరవాధ్యక్షురాలిగా ఉన్నాను కదా. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పెద్ద ఇష్టం లేదు’ అన్నాను. కానీ ‘ఆ మూడు (ఉత్తరాంధ్ర) జిల్లాలకు ప్రతినిధిగా మన ఇంట్లోవారు ఒకరుంటే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. నువ్వయితే అక్కడ వారికి భరోసాగా ఉంటుంది’ అన్నాడు జగన్. జగన్‌బాబు వస్తే ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాడన్న నమ్మకముంది. అందుకోసం అవసరమైనంత వరకు తిరుగుతాను.
దేశంలోనే రోల్‌మోడల్ ముఖ్యమంత్రిగా పేరున్న వైఎస్‌పై ఆరోపణలు చేస్తుంటే మీకేమనిపిస్తోంది?
రాజశేఖరరెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీసుకోమని అప్పట్లో అందరూ అన్నారు. 13, 14 రాష్ట్రాల ఉన్నతాధికారులు ఇక్కడికొచ్చారు. ‘బడ్జెట్ ఎలా పెరుగుతోంది, ఇన్ని సంక్షేమ పథకాలెలా ఇస్తున్నారు,ఎలా చేస్తున్నారు, నిజమా కాదా?’ అన్నట్టుగా చూద్దామని వారంతా వచ్చారు. రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడూ మీడియాను మేనేజ్ చేయలేదు. ఎప్పుడూ వ్యవస్థలను ఇబ్బంది పెట్టలేదు. అప్పట్లో గుజరాత్ నుంచి కూడా వచ్చి చూశారు. రాజశేఖరరెడ్డి గారికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. ఆయనకు పంచడమే తెలుసు. దగ్గరుండేది ఇవ్వడమే తెలుసు. ఇక్కడొక మాట చెప్పాలి. 2003లో ఆకలితో ప్రజలు అల్లాడిపోతూ చాలామంది చనిపోతున్నారు. ఆ సమయంలో ఆయన నాలుగు నెలలు పేదలకు అన్నం పెట్టా రు. అటువంటిది ఆయన్ను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పెట్టారు. జగన్ కాంగ్రెస్‌లో 18 నెలలు ఉన్నంతకాలం ఏ ఆరోపణలూ చేయలేదు. ఈ రోజు ఆయనలో అవినీతి ఎందుకు కనిపిస్తోంది? కేవలం ప్రజలకు ఇచ్చిన మాట కోసమే ఓదార్పు యాత్ర చేస్తానన్నందుకే కష్టాలపాలు చేశారు.
‘రాజశేఖరరెడ్డి గారు లేని లోటు తీర్చలేనిది. నా కొడుకు, కూతురు కూడా తీర్చలేరు. నేను చస్తే గానీ తీరదు’ అని మీరంటున్నారు. అలా ఎందుకనాల్సి వస్తోంది?
ప్రతిపక్షాలు అంత అన్యాయంగా మాట్లాడుతున్నాయి. రాజశేఖరరెడ్డి గారు ఏ తప్పూ చేయలేదు. జగన్ బాబు ఏ తప్పూ చేయలేదు. చంద్రబాబు ఏదైతే రాసిచ్చాడో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కోర్టులో పెట్టారు. దానిపై సీబీఐ ఎంక్వైరీ వేశా రు. చరిత్రలో ఎవరూ చూసి ఉండరు. ఏ ఎంక్వైరీ కూడా ఇంత అన్యాయంగా చేసి ఉండరు. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా నా వరకు రాజశేఖరరెడ్డిగారు లేని లోటును ఎవరూ తీర్చలేరు. నా కొడుకు, కూతురు కూడా తీర్చలేరు. అది నేను చస్తే గానీ తీరదు. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నా. విధి లేని పరిస్థితుల్లో నేనున్నాను. అందువల్లే ప్రజలకు ఆ మాట చెబుతున్నాను. ప్రజలకు వైఎస్ లేని లోటును జగన్ తీరుస్తాడు.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో చూసినప్పుడు మీకేమనిపించింది?
జగన్‌బాబు మేనిఫెస్టో పెట్టినప్పుడు చాలా సంతోషమనిపించింది. చాలా గర్వంగా అనిపించింది. వాళ్ల నాన్నలాగే ప్రతి వ్యక్తి గురించీ ఆలోచన చేస్తున్నాడు, రాష్ట్రాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు అని గర్వంగా అనిపించింది. వాటన్నిం టినీ నెరవేర్చాలని కోరుకుంటున్నా. రాజశేఖరరెడ్డి 2009కి వచ్చేసరికి, ‘చెప్పినవి చేశాను. చెప్పనివీ చేశాను’ అన్నారు. ఆనాటి మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఫీజు రీయింబర్సుమెంట్ వంటివేమీ లేవు. ఒక్క ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు మాత్రమే ఉన్నాయి. కానీ అవన్నీ రాజశేఖరరెడ్డి గారు చేసిన, విజయవంతం అయిన పథకాలు. రాజశేఖరరెడి ్డగారు పోయినప్పుడు టి.జి.వెంకటేశ్ చెప్పారు. ఆయన పథకాలన్నీ ఏదీ వదలకుండా వరుసగా చెబితే రూ.3 లక్షలు ఇస్తానన్నారు.
నేనే అన్నీ చెప్పలేను. జగన్‌బాబు కూడా తప్పకుండా ఆ విధంగా చేస్తారని అనుకుంటున్నా. రాజశేఖరరెడ్డి గారి కోసం 700 మందికి పైగా చనిపోయారు. ఆ కుటుంబాలను ఓదార్చే క్రమంలో వారి బాధలను జగన్ చాలా దగ్గరగా చూశాడు. వారి బాధలను విన్నాడు. ఏదైనా చేయాలనే తపన, స్పందించే గుణం జగన్‌కు ఉన్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్యలను చూస్తున్నప్పుడు వీరందరికీ ఆ తపన ఎందుకు లేదా అనిపించింది. చంద్రబాబు పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి ఉండేది కాదు.తాగేందుకు నీరు లేదు. లక్షలాది మంది వలస పోయారు. వారందరి కోసం రాజశేఖరరెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అందుకే ఆయన పాలనను ‘స్వర్ణయుగం’ అంటున్నాం.
అభివృద్ధిలో రెండు ప్రాంతాలకూ వైఎస్ సమాన ప్రాతినిధ్యం ఇచ్చారని మీరు భావిస్తున్నారా?
వైఎస్ హయాంలో ఐదేళ్లలో గుజరాత్ కంటే మన రాష్ట్రంలో ఎంతో ఎక్కువ అభివృద్ధి జరిగింది. రాజశేఖరరెడ్డి గారు దూరమైన తరువాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మూడు, నాలుగుకోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులను కూడా చేపట్టలేదు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల రూపకల్పన అయినా, హంద్రీ-నీవా పూర్తయ్యిందన్నా వైఎస్ సంకల్పమే. దేవాదుల, నెట్టెంపాడు, పులిచింతల, కల్వకుర్తి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేయాలనుకున్నారు. మూడేళ్లలో 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారు. ఆయనుంటే పూర్తయ్యేవి. నాకంటే ఈ రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులని నాకనిపిస్తోంది.
రైతులు, చేనేతలకు మళ్లీ మంచిరోజులు ఎప్పుడొస్తాయి?
ఇప్పుడు చంద్రబాబు-2 పరిపాలన కొనసాగుతోంది. రైతులకు అసలు భరోసా లేదు. జల్, నీలం, లైలా తుపాన్లు వస్తే కనీసం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే కూడా చేయలేదు. నష్టపరిహారం, బీమా... ఏదీ ఇవ్వలేదు. కాబట్టి చంద్రబాబు-2 పాలన అని చెప్పాలి. ఈ రోజు చంద్రబాబు అన్నీ అసత్యాలు చెబుతున్నారు. రైతులకు రుణ మాఫీ అంటున్న బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశారు? కేంద్రానికి లేఖ అయినా రాశారా? వడ్డీ మాఫీ చేశారా? కనీసం వడ్డీని తర్వాతి ఏడాది కట్టుకుందురు లెమ్మంటూ వెసులుబాటు ఇచ్చారా? ఉచిత విద్యుత్ గురించి ఆలోచించారా? కరెంటు బిల్లుల మాఫీ గురించి ఆలోచించారా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నష్టపరిహారం ఇచ్చారా? ఏదీ ఇవ్వలేదు. అలాంటి వ్యక్తి ఈ రోజు మాత్రం రుణ మాఫీ చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
బాబుపై మీరు వేసిన కేసులను ఎలా నీరుగార్చారు?
చంద్రబాబుపై నేను వేసిన కేసులను నీరుగార్చారు. ఆయన చేసిన అవినీతి కుంభకోణాలపై నేను కేసులు వేస్తే, వాటిపై నెల రోజుల్లో విచారణ చేపట్టాలని కోర్టు చెప్పింది. కానీ అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఆయనకు బాగా కావాల్సిన వ్యక్తి కదా! సిబ్బంది లేరనే సాకుతో బాబుపై విచారణ చేయలేదు. బాబు స్టే తెచ్చుకుని బతుకుతున్నారు. ఇవన్నీ ప్రజలకు బాగా తెలుసు. వారు బాగా విజ్ఞులు.
ఈ ఎన్నికల్లో మీకెన్ని సీట్లొస్తాయనుకుంటున్నారు?
వైఎస్సార్‌సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. 90 శాతం సీట్లొస్తాయి. 2019లో తెలంగాణలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. అక్కడ ఓదార్పు యాత్ర జరిగి ఉంటే అక్కడ కూడా మాకు ఆదరణ ఇంకా పెరిగేది. వైఎస్ అత్యుత్తమ సీఎం అని సీమాంధ్రలో 53 శాతం చెబుతుంటే, తెలంగాణ ప్రాంతంలో 63 శాతం చెబుతున్నారు. ఆయన పథకాలతో తెలంగాణవాసులు ఎక్కువగా లబ్ధి పొందారు. అభివృద్ధిని చూసుకుంటే... కాంగ్రెస్‌కూ చరిత్ర లేదు, కేసీఆర్‌కూ చరిత్ర లేదు.
బాబుది 420 విజన్
బాబు విజన్ 2020 కాదు. అదొక 420. చంద్రబాబు పుట్టిన తేదీ (ఏప్రిల్ 20) కూడా అదే వస్తుంది. బీహెచ్‌పీకి నష్టాలు తెచ్చి దాన్ని ఎల్ అండ్ టీకి ఇవ్వాలనుకున్నారు చంద్రబాబు. అర్టీసీకి కూడా నష్టం చేయాలనుకున్నారు. జెన్‌కోను నిర్వీర్యం చేశారు. దానికి గ్యాస్ కేటాయింపులు కూడా లేకుండా వేల కోట్ల రూపాయల అప్పనంగా కట్టబెట్టారు. ఆప్కో, బీసీ కార్పొరేషన్... ఇలా ప్రతీ వ్యవస్థనూ నిర్వీర్యం చేశారు. 65 లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలను దేవేందర్ గౌడ్, సుజనా చౌదరి, సీఎం రమేశ్, మురళీమోహన్, రామోజీరావు, బిల్లీరావు, సత్యం రామలింగరాజు.. ఇలా అందరికీ కట్టబెట్టారు.
ఆ రోజు 26 వేల ఉద్యోగాలు పోయాయి. 26 లక్షలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆ రోజు రెండు హైటెక్ బిల్డింగులు కట్టి, వాటిని భూతద్దంలో చూపించి ప్రపంచ బ్యాంకు చెప్పినట్టల్లా నడుచుకున్నారు బాబు. బిల్ క్లింటన్, బిల్‌గేట్స్ జపం చేస్తూ కోట్ల రూపాయల అప్పును మన నెత్తిన రుద్దారు. హైటెక్ సిటీ నిర్మాణ కాంట్రాక్ట్ కూడా ఎల్ అండ్ టీ వాళ్లకిచ్చారు. డబుల్ ధమాకా కింద హెరిటేజ్ బిల్డింగ్‌ను, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను వాళ్లు ఆయనకు ఫ్రీగా కట్టిచ్చారు. అంతకంటే మేలు చేసిందేమీ లేదు చంద్రబాబు.