పొత్తు.. ఎత్తు | BJP-TDP tie up deals over general elections | Sakshi
Sakshi News home page

పొత్తు.. ఎత్తు

Published Thu, Apr 24 2014 12:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

పొత్తు.. ఎత్తు - Sakshi

పొత్తు.. ఎత్తు

* కత్తులు దూసుకుంటున్న కమలం-పసుపు
* ఎంపీ ఓటు నాకు... ఎమ్మెల్యే మీ ఇష్టం
* అన్ని పార్టీల అసెంబ్లీ అభ్యర్థులతో ఎంపీ అభ్యర్థుల ఒప్పందాలు
* భారీగా నమోదు కానున్న క్రాస్ ఓటింగ్
* పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో విచిత్ర పరిస్థితి

 
 గోదావరి ఖని నుంచి: ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి బి. నారాయణరెడ్డి: పొత్తు బెడిసికొట్టనుందా ? వికసిస్తుందనుకున్న  పొత్తు వికటించనుందా ? అదే పొత్తు ఓటమికి దారి తీస్తుందా ? బీజేపీ-టీడీపీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు పట్ల అభ్యర్థుల భయాలు ఇవి. ఈ రెండు పార్టీ మధ్య నెలకొన్న గ్యాప్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఇతర పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు ఎవరికైనా వేసుకోండి....ఎంపీకి మాత్రం మాకే వేయండి అనే ఒప్పందానికి వస్తున్నారు. దాంతో కరీంనగర్ జిల్లాలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. పైగా...ఒక పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి బలంగా ఉంటే...ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బలహీనంగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. తాము గెలిస్తే సరి..  మా పార్టీ అభ్యర్థులు ఏమైనా ఫర్వాలేదని వారు భావిస్తున్నా రు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టం అవుతున్నది.
 
 రామగుండం బెస్ట్ ఎగ్జాంపుల్...!

 పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుడం అసెంబ్లీ సెగ్మెంట్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మొత్తం 27 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆటో డ్రైవర్, ఇడ్లీ బండి నడిపే వారి నుంచి గత ఎన్నికల్లో మొదటి మూడు  స్థానాల్లో ఉన్న వారందరూ  రంగంలో ఉన్నారు. విచిత్రంగా ప్రధాన పోటీ స్వతంత్రుల మధ్యనే నెలకొంది. కౌశిక్ హరి (కాంగ్రెస్ రెబల్), కోరుకంటి చందర్ (టీఆర్‌ఎస్ రెబల్) మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్), బాబర్ సలీంపాషా (కాంగ్రెస్), గుజ్జుల రామక్రిష్ణారెడ్డి (బీజేపీ) వారితో  పోటీ పడలేకపోతున్నారు.
 
  స్వతంత్రులు సమానంగా ఓట్లు చీల్చుకుంటే....ప్రధాన పార్టీ అభ్యర్థికి ఊహించని మేలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితిని అంచనా వేసి ఎంపీగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థి స్వతంత్రులతో ఒప్పందానికి వస్తున్నారు. ఎమ్మెల్యే ఓట్లు మీరేయించుకోండి...ఎంపీ ఓట్లు మాత్రం నాకేయించండి. అందుగ్గాను మీకు సహాయం చేస్తాననే హామీ ఇచ్చినట్టు సమాచారం. దాంతో ఎమ్మెల్యే ఎవరు గెలిచినా ఎంపీకి  ఓట్లు తనకే పడతాయనే నమ్మకంలో ఉన్నారు.
 
 ఇద్దరినీ దెబ్బతీసిన పొత్తు..!
  బీజేపీ-టీడీపి పొత్తు బెడిసికొట్టినట్టే. ఓట్ల పంపకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తున్నది.   వారికి టీడీపీ నుంచి అనుకున్న  సహాకారం అందడం లేదనే విమర్శ ఉంది. టీడీపీ పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా బీజేపీ నుంచి అదే సమస్య ఎదురవుతున్నది. పైగా ఈ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్‌రావు రంగంలో ఉన్నారు. దాంతో ఈ అవకాశాన్ని ఇతర పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి.  నియోజకవర్గాన్ని బట్టి ఎంపీకి ఒక పార్టీకి, ఎమ్మెల్యే స్థానానికి మరో పార్టీకి ఓట్లు వేసే పరిసి  ్థతి ఉంది. అన్ని పార్టీలు  క్రాస్ ఓటింగ్‌ను ప్రొత్సహిస్తున్నారు.
 
విచిత్రంగా మారిన  ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు...!
 కరీంనగర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. దాంతో ప్రత్యర్థి పార్టీలకు కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. టీడీపి క్యాడర్ ద్వారా వచ్చే ఓట్ల కోసం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరో అడుగు ముందుకేసి ఒక పార్టీ ఎంపీ అభ్యర్థి మరో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థితో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు.
-   సిరిసిల్లాలో టీడీపీ వారు బీజేపీకి పనిచేయడం కష్టం...దాంతో టీఆర్‌ఎస్‌కి  లాభంగా మారింది.
 -    జగిత్యాలలో బీజేపీ వారు టీడీపి అభ్యర్థి ఎల్ రమణకు ఎంత వరకు మద్దతు ఇస్తారనేది అనుమానంగా ఉంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రయోజనకరంగా ఉంది.
-     పెద్దపల్లిలో ఇరుపార్టీల మధ్య సమన్వయం లేదు.
 -    ధర్మపురిలో కూడా అంతే బీజేపీ అభ్యర్థికి టీడీపి నుంచి అనుకున్న స్పందన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement