‘వేలిపై సిరాచుక్క’ ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా మొదటిసారి తమ ఓటుహక్కును వినియోగించుకున్న యువత ఆ ఆనందాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్‌లోని తమ సన్నిహితులతో పంచుకుంటున్నారు. వారిలోనూ స్ఫూర్తి పెంచేలా కామెంట్లు, మెస్సేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా గురువారం నాటి మూడో విడత పోలింగ్‌లో ఓటేసి వచ్చిన యువత సిరాచుక్కతో ఉన్న వేలును గర్వంగా చూపిస్తూ ఫొటోలు దిగి వాటిని ఆ వెబ్‌సైట్లలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలతో పాటు పోస్ట్ చేసిన కామెంట్లలో కొన్ని.. ‘మై ఇండియా.. మై ఓట్.. మై ప్రైడ్’, ‘భారతీయుడిగా నేను చేసిన అత్యుత్తమ పని ఓటు వేయడం’, ‘ఇంక్‌డ్ ఫర్ చేంజ్’, ‘ఏ దేశమూ ఫర్‌ఫెక్ట్ కాదు.. మనమే మన దేశాన్ని ఫర్‌ఫెక్ట్‌గా చేసుకోవాలి.. ఇండియాను ఫర్‌ఫెక్ట్‌గా చేసేందుకు నా బాధ్యత నేను నిర్వర్తించాను’, ‘ఈ సిరాచుక్క టాటూ కన్నా గొప్ప’ ‘నేను ఓటేశా.. మరి మీరు?’