
బీజేపీలో ఆరని ‘బిహార్’ మంట
సాక్షి, బెంగళూరు/నాగ్‌పూర్: బీజేపీలో ‘బిహార్’ మంటలు చల్లారడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో మోదీ-షా ద్వయంపై విమర్శలు గుప్పించిన సీనియర్ నేతల దారిలోనే మరికొందరు నడుస్తున్నారు. తాజాగా పార్టీ ఎంపీ, హోంశాఖ మాజీ కార్యదర్శి ఆర్‌కే సింగ్ సీనియర్లతో గొంతు కలిపారు. ఓటమికి బాధ్యులను తేల్చాల్సిందేనన్నారు. ‘బిహార్ ఎన్నికల్లో ఓటమిపై తప్పకుండా సమీక్ష జరగాలి. ఎక్కడ తప్పు చేశామో, ఎవరు బాధ్యులో తేలాలి. మార్గదర్శక మండలి కూడా ఇదే విషయాన్ని చెప్పింది’ అని పేర్కొన్నారు. ఈఎన్నికల్లో బీజేపీ కొందరు నేరచరిత్ర ఉన్నవారికీ టికెట్లు ఇచ్చిందన్నారు. ‘వారిలో కొందరిపై ప్రభుత్వమే రివార్డులు ప్రకటించింది. ఇది చాలా బాధాకరం’ అని పేర్కొన్నారు. పార్టీకి చెందిన మరో పార్లమెంట్ సభ్యుడు(ఈశాన్య ఢిల్లీ ఎంపీ) మనోజ్ తివారీ కూడా ఎన్నికల్లో పార్టీ పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి అనుసరించిన వ్యూహాలు కచ్చితంగా బీజేపీ కంటే మెరుగ్గా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో బీజేపీ అజెండా ప్రజలను మెప్పించలేకపోయిందన్నారు.
పార్టీ వేదికలపై మాట్లాడి ఉండాల్సింది: వెంకయ్య
బిహార్‌లో ఓటమిపై సీనియర్ నేతలు ముందుగా తమ అభిప్రాయాలను పార్టీ వేదికపై ప్రస్తావించి ఉంటే బాగుండేదని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవార ం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘పార్టీకి, దేశానికి మోదీ నాయకత్వం అవసరం. సీనియర్లు కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. అయితే బహిరంగ వ్యాఖ్యలకు బదులు పార్టీ వేదికలపై వారు తమ అభిప్రాయాలను పంచుకుంటే బాగుండేది. బిహార్‌లో ఓటమిపై సమగ్ర సమీక్ష జరపాలని పార్లమెంటరీ బోర్డు ఇప్పటికే నిర్ణయించింది’ అని చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేనని, వాటికి పార్టీయే సమష్టి బాధ్యత వహిస్తుందని స్పష్టంచేశారు.
క్రమశిక్షణ చర్యలపై చెప్పలేదు: గడ్కారీ
సీనియర్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాను పార్టీకి ఎలాంటి సూచనలూ చేయలేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికల్లో పనితీరుపై వారు వ్యక్తంచేసిన అభిప్రాయాలపై పార్టీ నాయకత్వం చర్చిస్తోందని ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు అత్యంత గౌరవం ఉందని, తాను గానీ మరెవరూ గానీ వారిపట్ల అగౌరవంగా ప్రవర్తించలేదన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తాను పార్టీ అధ్యక్షుడికి సూచించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.