కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో ఇరు ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడవుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టి, కొత్త వాదనలు, కొత్త అనుమానాలు, భయాలు కల్పించి తాత్కాలిక ప్రయోజనం పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని దుయ్యబట్టారు. ఈ తీరును ఇరు ప్రాంతాల ప్రజలు అర్థం చేసుకుంటారని, అప్పడు కాంగ్రెస్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడవుతుందన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని ప్రతిపాదన చేస్తారు. అక్కడి సీఎం కిరణ్ వ్యతిరేకిస్తారు. అంతిమంగా ఏంచేస్తారనేది కాంగ్రెస్, కేంద్రమే నిర్ణయించాలి’ అని చెప్పారు. తెలంగాణకు అనుకూలమని ఏఐసీసీ తీర్మానం చేస్తే, సమైక్యానికి అనుకూలమని పీసీసీ చీఫ్ అనడం ఎవరిని మభ్యపెట్టడానికని ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టకుంటే తాము అధికారంలోకి వచ్చాక బిల్లు పెడతామన్నారు.