కాఫీ.... టిఫిన్లాగా... అత్యాచారాలు నిత్యకృత్యం
శాసనమండలిలో విపక్ష నేత కె.ఎస్. ఈశ్వరప్ప
బెంగళూరు : కాఫీ, టిఫిన్ లేకుండా ఎలా రోజు గడవదో అలాగే రాష్ట్రంలో అత్యాచారాలు జరుగని రోజంటూ లేదు. మహిళలు, పిల్లలపై లైంగిక, భౌతిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండమే ఇందకు కారణం' అని అధికార కాంగ్రెస్ పై శాసనమండలిలో విపక్షనాయకుడు కె.ఎస్.ఈశ్వరప్ప నిప్పులు చెరిగారు. మండలిలో బుధవారం సభా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయమై జరిగిన చర్చలో ఈశ్వరప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆరేళ్ల చిన్నారితో మొదలుకుని అరవై ఏళ్ల ముసలి వారిపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాంగ్రేప్లు రాష్ట్రంలో నిత్యకృత్యమైనా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించిన వారిపై భౌతిక దాడులు జరుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు మడికేరి ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి నలుగురు వ్యక్తులు చనిపోవడం సర్కారు వైఫల్యమని ఆయన ఆరోపించారు.
ఇలా ప్రతి రోజూ ఏదో ఓ చోట శాంతిభద్రతల సమస్య తలెత్తుతున్నా మంత్రులతోపాటు అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఓ వర్గం ప్రజలు దేశద్రోహానికి పాల్పడుతున్నా ప్రభుత్వం ఓట్ల కోసం వారిని వెనకేసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే హోంశాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ స్పందిస్తూ... కె.ఎస్. ఈశ్వరప్ప ఇలా మాట్లాడటం సరికాదన్నారు. ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మండలి చైర్మన్ శంకరమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు.