చాయ్తో మనసు మాట..
ముంబై: ఇష్టమైన వ్యక్తులతో కలిసి చాయ్ తాగుతూ ముచ్చట్లాడటం ఎవరికి నచ్చదు? బిజీ లైఫ్ లో అంత తీరిక ఎక్కడ? అంటారా.. అయితే ఓ సారి ముంబై వెళ్లిరావాల్సిందే. ఆదివారం ముంబైలోని లోకల్ రైల్వే స్టేషన్లు, కొన్ని ఇతర ప్రాంతాల్లో జనం ఒక్కచోట చేరి చాయ్ తాగుతూ.. ఎవరివో మాటలు శ్రద్ధగా వింటున్న దృశ్యాలు కనిపించాయి. ఆరా తీస్తే వారంతా 'మనసులో మాట' శ్రోతలని తేలింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన చాయ్ పే చర్చా, మన్ కీ బాత్ కార్యక్రమానలు కలిపేసి.. 'మన్ కి బాత్.. చాయ్ కే సాత్' అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు ముంబై బీజేపీ నాయకులు.
ముంబైలో 120 చోట్ల జనం సౌకర్యంగా కూర్చునేలా కుర్చీలు, బల్లలు సిద్ధం చేసి.. అక్కడికి వచ్చినవాళ్లందరికీ చాయ్ ఇచ్చిమరీ 'మన్ కీ బాత్' వినిపించారు బీజేపీ నాయకులు. ఇందుకోసం పెద్ద పెద్ద స్పీకర్లను ఏర్పాటుచేసి, రేడియో ప్రసారాన్ని వాటి ద్వారా వినిపించారు. ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించిన దాదాపు అన్ని చోట్లా జనం నుంచి విశేష స్పందన లభించడంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ప్రధాని మనసులో మాట(మన్ కీ బాత్) ను ప్రజలకే మరింత చేరువ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. బీజేపీ మహారాష్ట్ర చీఫ్ రావు సాహెబ్ దన్వే, మంత్రులు వినోద్ తావ్ డే, ప్రకాశ్ మెహతా, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షేల్కర్, ఇతర ముఖ్యనాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.