
సీమాంధ్ర ప్రయోజనాలూ పరిగణనలోకి..
* బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం
* టీ బిల్లుకు సవరణలు కోరదాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. ఆ మేరకు పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సవరణలు కోరాలని తీర్మానించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఎల్.కె.అద్వానీ నివాసంలో సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, రాజ్యసభలో విపక్ష నేత అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులను చర్చ లేకుండా ఆమోదించనీయ కూడదని, అవసరమైతే ప్రతి బిల్లుకు సవరణలు కోరాలని తీర్మానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి ఈ పార్లమెంటు సమావేశాలు చివరివి కావడం వల్ల బిల్లులు ఆమోదం పొందితే ఆ పార్టీకే క్రెడిట్ పోతుందని, అందువల్ల ప్రతి బిల్లుపై వీలైనంత ఎక్కువ చర్చ జరపాలని, సవరణలు కోరాలని నేతలు సూచించారు. ‘ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ అనేక బిల్లులను ప్రవేశపెడతామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆయన బిల్లులకు మనం ఎందుకు మద్దతివ్వాలి. ఆయన ఎన్నికల ఎజెండాకు మనం ఎందుకు సహకరించాలి..’ అని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
పలు ఇతర అంశాలతో పాటు రాష్ట్ర విభజన బిల్లుపై కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ వైఖరిలో మార్పులేదని పునరుద్ఘాటిస్తూనే.. సీమాంధ్రుల ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని నిర్ణయించారు. టీ బిల్లును అసెంబ్లీ తిరస్కరించడం, సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి సహా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు బిల్లును వ్యతిరేకిస్తుండడం తదితర పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం పార్టీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే పక్షాలతో కలిసి అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. టీ బిల్లు విషయంలో కాంగ్రెస్‌లోనే ఐక్యత లేదని, సొంత పార్టీ సీఎం కిరణ్ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయించారని విమర్శించారు.