‘హోదా’ దక్కదా?
ఏపీ ప్రజల ఆశలపై శరాఘాతంలా పార్లమెంట్‌లో మంత్రి ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లుచల్లింది. ఎప్పుడెప్పుడా అని గడిచిన 14 నెలలుగా ప్రత్యేక హోదా వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలపై కేంద్రం నిర్ఘాంతపరిచే నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్త రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని శుక్రవారం లోక్‌సభ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో జార్ఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ విష్ణుదయాల్‌రామ్ రాష్ట్రాల ప్రత్యేక హోదా కల్పించే అంశంపై అడిగిన ప్రశ్నతో పాటు వివిధ రాష్ట్రాల సభ్యులు అడిగిన ఉప ప్రశ్నలపై కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ సమాధానమిస్తూ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నే తలెత్తదని తేల్చిచెప్పారు.
దీనిపై ఆయన ప్రణాళికా సంఘం నిర్ణయాలంటూ పలు విషయాలు ఉటంకించినప్పటికీ మంత్రి సమాధానంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వబోరన్న విషయం మాత్రం స్పష్టమైంది. ఆవశేషాంధ్రప్రదేశ్‌కు అనేక ఇబ్బందులు ఉన్నాయని, ప్రత్యేక హోదా సాధించి తీరుతామని, కొద్ది రోజుల్లో ఆ నిర్ణయం జరగబోతోందంటూ ఇంతకాలం తెలుగుదేశం, మిత్రపక్షమైన బీజేపీ చెబుతున్న మాటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలకు కేంద్రం తాజాగా చేసిన ప్రకటన విస్మయానికి గురిచేసింది. ఇదే అంశంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి వివరణ ఇస్తూ ‘‘గత ఏడాది నుంచి అనేక రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడుగుతున్నాయి.
అలాగే 2015-16 సంవత్సరానికి గాను బీహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రత్యేక కేంద్ర సాయం కోరాయి. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా విషయమై పెంచడమా లేదా తగ్గించడమా అన్న నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నీతి ఆయోగ్ నిర్ణయిస్తుంది. 14 వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసులను ప్రస్తుత ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు గతంలో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు 32 శాతం ఉన్న వాటా ప్రస్తుతం 42 శాతానికి పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కల్పించడం అన్న ప్రశ్న తలెత్తదు..’’ అని ఆయన స్పష్టంచేశారు. బీహార్, రాజస్థాన్, ఒడిశా సభ్యులు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై మరో ఉప ప్రశ్నలు సంధించగా... ‘‘నేను ముందే చెప్పినట్టుగా బీహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రత్యేక హోదా అడిగాయి. మేం ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ ప్రత్యేక సాయం చేసే అంశం పరిశీలనలో ఉంది. ఇప్పటివరకు దానిపై నిర్ణయం జరగలేదు.. ప్రత్యేక ప్యాకేజీ అడిగిన రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి. వాటిపై ఇంకా నిర్ణయం పూర్తికాలేదు..’’ అని మంత్రి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు మెతక వైఖరి
14 ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రాలకు 32% ఉన్న వాటాను 42 శాతానికి పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించడంతోనే చంద్రబాబు సంతృప్తి చెందారు. ప్రత్యేక హోదా కోసం తానేదో ప్రయత్నం చేశానని చెప్పుకోవడానికి పలు దఫాలు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందించడంతోనే సరిపుచ్చారు. ఏపీ అభివృద్ధి చెందడానికి కీలకమైన ప్రత్యేక హోదాపై కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీపై ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేదు. బాబు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రశ్నించినప్పటికీ ఆయన ఇప్పటివరకు సూటిగా సమాధానం చెప్పలేదు.
సరికదా ఒకదశలో మాకు నిధులు ఇస్తే చాలు ప్రత్యేక హోదా అక్కరలేదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి ప్రకటన చేసినా విజయవాడలో జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ విషయంపై ఏ మాత్రం చర్చించలేదు.
ఏపీకి షాక్...: తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదించే సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ కోరాయి. ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక ప్రకటన కూడా చేశారు.
‘‘13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత తొలి ఏడాదిలోనే రెవెన్యూ లోటు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అపాయింటెడ్ డే నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అందేవరకు ఈ రెవెన్యూ లోటును భర్తీచేసేందుకు వీలుగా 2014-15 సాధారణ బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం..’’ అని హామీ ఇచ్చారు. నాటి ప్రధానమంత్రి ఈ ప్రకటన చేస్తున్న సందర్భంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు సరిపోదని, పదేళ్ల పాటు అమలుచేయాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే పదేళ్లపాటు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ హామీ అమలు దిశగా 2014 మార్చి 3న ఏపీకి స్పెషల్ స్టేటస్ అమలుచేయాలని కేంద్ర కేబినెట్ ప్రణాళిక సంఘాన్ని ఆదేశించింది. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోకి అధికారంలోకి వచ్చిన టీడీపీ బీజేపీతో జతకట్టింది. కానీ ప్రత్యేక కేటగిరీ హోదాపై రెండు పార్టీలు కొద్దికాలం నోరు విప్పలేదు.ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని లీగల్ హామీలకు కట్టుబడి ఉంటామని బడ్జెట్ సమయంలో అరుణ్ జైట్లీ చెబుతూ.. పరోక్షంగా స్పెషల్ స్టేటస్ హామీ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో లేదని చెప్పకనే అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తోనే ఈ చిక్కంతా వచ్చిందని, ఆ పార్టీ బిల్లులో ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని సాక్షాత్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం తన నివేదిక సమర్పించింది. ఇది పరోక్షంగా హోదా రాదని తేల్చింది.
ఏపీ ప్రగతి ఎలా?: ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్న ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడంవల్ల రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రభావం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తే కేంద్రం నుంచి నిధులు పెరుగుతాయి. రాష్ట్రంలో చేపట్టిన ఆయా ప్రాజెక్టులకు 90% నిధులు కేంద్రం నుంచి గ్రాంటుగా లభిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని చేపట్టిన ప్రాజెక్టుల నిధుల్లో 90% కేంద్రమే భరిస్తుంది. ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల పారిశ్రామిక రంగం ఊతమందుకుంటుంది. హోదా కోసం ఏడాదికాలంగా అవి ఎదురుచూస్తున్నాయి. తాజా పరిణామాలతో పారిశ్రామిక అృవద్ధి కుంటుపడి ఉపాధి అవకాశాలు లభించక నిరుద్యోగులు తీవ్ర నిరాశలకు లోనయ్యే ప్రమాదం ఉంది.
ప్రత్యేక హోదాపై జగన్ దీక్ష
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పలు దఫాలుగా కేంద్రం ముందు వాదించిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇదే అంశంపై ఆగస్టు 10న ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కేంద్రంపై చివరి వరకు ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారని పలుసార్లు ప్రశ్నించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గం నుంచి టీడీపీ మంత్రులు తప్పుకుంటే బీజేపీ దిగొస్తుందని, రాష్ట్రం కోసం ఆ పని చేయాలని డిమాండ్ చేసినా బాబు స్పందించలేదు.