రద్దుతో రైతులకు మేలే
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
- పెద్దనోట్ల రద్దు వల్ల రైతులకు నష్టం లేదు
- అన్నీ వ్యతిరేకించడమే విపక్షాల లక్ష్యం
- ఆంధ్రాలో బీజేపీని పటిష్టం చేయాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలో నిర్వహించిన రైతు మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెండున్నర ఏళ్లలో అన్నివర్గాలు ప్రగతిపథంలో వెళ్లేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రైతులు, గ్రామాల అభివృద్ధిపై మోదీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, దీనిలో భాగంగానే మూడు దశాబ్దాల కాలంలో మూతపడిన ఎరువుల పరిశ్రమలను మళ్లీ తెరిపించారన్నారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు నష్టపోతున్నారని, వీరిని ఆదుకునే ప్రయత్నం మోదీ వచ్చిన తర్వాతే జరిగిందన్నారు. ‘ప్రధాని ఫసల్ బీమా యోజన’ ద్వారా రైతు పంటకు భరోసా వచ్చిందన్నారు.
హోదా కన్నా ఎక్కువే ఇస్తాం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గల ఏ అవకాశాన్నీ కేంద్రం వదలడం లేదని అమిత్‌షా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోరుునా కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోరిక మేరకు హోదా కన్నా ఎక్కువ ఉండేలా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు సాయం చేస్తున్నామని, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పరిశ్రమలకు రారుుతీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రత్యేక హోదా వల్ల 90 శాతం కేంద్ర నిధులు వస్తాయని, హోదా లేకపోతే 60 శాతం నిధులే గ్రాంట్‌గా వస్తాయని, మిగిలిన 30 శాతం నిధులు కూడా కేంద్రం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. రూ.22 వేల కోట్ల ఆర్థిక లోటును కూడా తామే భరిస్తామని చెప్పారు.
అన్నిటినీ వ్యతిరేకిస్తారు
మోదీ ఏం చేసినా వ్యతిరేకించడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని అమిత్‌షా దుయ్యబట్టారు. ఆఖరికి మోదీ ఈ రోజు సోమవారం అంటే కాదు మంగళవారం అనే పరిస్థితికి విపక్షాలు వెళ్లాయని ధ్వజమెత్తారు. మోదీ వంటి ప్రధాని ఉండబట్టే యూరీ, పటాన్‌కోట్ ఘటనలపై పాక్‌కు దీటైన సమాధానం ఇచ్చారన్నారు. దీన్ని కూడా రాహుల్ వంటివారు విమర్శిస్తున్నారన్నారు. నోట్ల రద్దువల్ల రైతులకు ప్రయోజనమేకాని నష్టం ఉండదన్నారు. నల్లధనం ఉన్నవారికే ప్రధాని నిర్ణయం భయం కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని మరింత పటిష్టం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
మోదీ దేవుడు పంపిన దూత: వెంకయ్య
మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం ధర్మయుద్ధం చేస్తున్నారని, అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కోరారు. పెద్ద నోట్ల రద్దు ఏ వ్యక్తినో, పార్టీనో ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని, తీవ్రవాదం కోరలు పీకివేయడానికి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. రైతులు నష్టపోతారని చెబుతున్నారని, రైతుల వద్ద నల్లధనం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. సామాన్య ప్రజల రక్షణ కోసం దేవుడిచ్చిన దూత మోదీ అని వెంకయ్యనాయుడు పొగడ్తల జల్లు కురిపించారు. మోదీ నిర్ణయంతో కార్మికులతో బంద్ చేరుుస్తామని కమ్యూనిస్టులు అంటున్నారని, కమ్యూనిజంలో నిజం లేదని, అందుకే వారి మాటలు ఎవరూ నమ్మడం లేదని, బంద్‌లు సాగవని వెంకయ్యనాయుడు చెప్పారు. ఆరుుల్‌పామ్ రైతులను ఆదుకునేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కాగా తమకూ పెరిగిన రేట్ల ప్రకారం ఆర్‌ఆర్ ప్యాకేజీని అమలు చేయాలంటూ అమిత్‌షాను కలసిన పోలవరం నిర్వాసితుల ప్రతినిధుల బృందం వినతిపత్రం అందజేసింది. మరోవైపు రైతుల సమస్యలపై చర్చించేందుకు కనీసం వారం, పది రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరపాలంటూ రైతు సంఘాల ప్రతినిధిబృందం అమిత్‌షాకు విజ్ఞప్తి చేసింది.