పెద్దదేవులపల్లిలో అమిత్ షాకు మైసూర్ పాక్ తినిపిస్తున్న పిచ్చమ్మ
- ప్రజలతో మమేకమైన కమల దళాధిపతి
- పెద్దదేవులపల్లిలో ఏడు కుటుంబాలతో భేటీ.. అక్కడే సహపంక్తి భోజనం
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారం మూడు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. నల్లగొండ మండలం వెలుగుపల్లి, కనగల్ మండలం చిన మాదారం, త్రిపురారం మండలం పెద్దదేవుల పల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం వెలుగుపల్లిలోని ఎస్సీ కాలనీకి పండిట్ దీన్‌దయాళ్ కాలనీగా నామకరణం చేశారు. అక్కడే దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరిం చారు. అనంతరం బీజేపీ సర్పంచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కనగల్ మండలం చినమాదారం వెళ్లి అక్కడ స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సభలో పాల్గొని గ్రామస్తులనుద్దేశించి మాట్లా డారు. అక్కడే ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన గ్యాస్ కిట్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి మీదుగా నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని పెద్దదేవులపల్లికి వెళ్లారు. అక్కడ ఏడు కుటుంబాలను కలిసి వారి స్థితిగతులను, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అక్కడ్నుంచి మిర్యాలగూడ పట్టణం మీదుగా నల్లగొండ చేరుకున్నారు. నల్లగొండలో విలేకరుల సమా వేశంలో పాల్గొన్న అనంతరం స్థానికంగా బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించినందుకుగాను ఏర్పాటు చేసిన ఈ సభలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి కొందరు ప్రము ఖులతో కలిసి రాత్రి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు.
మహిళా రిజర్వేషన్లతో గ్రామాలకు స్వయంశక్తి...
పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం వల్ల గ్రామాలు స్వయం శక్తి సాధిస్తున్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. చినమాదారంలో గ్రామ ప్రజలను ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడారు. చినమాదారం అభివృద్ధిని చూసి తాను ఆశ్చర్యపోతున్నానని, తనకు ఎంతో ఆనందం కలుగుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి జన్‌ధన్ యోజన కింద బ్యాంకు ఖాతా, 100 శాతం గ్యాస్ కనెక్షన్లు, రోడ్లు, వృద్ధ మహిళలకు పింఛన్లు వంటి కార్యక్రమాలు బీజేపీ సర్పంచ్ వల్లే సాధ్యమయ్యాయన్నారు. గ్రామంలో మొత్తం 584 ఇళ్లు ఉంటే అందులో 300 ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, మిగిలిన 284 మరుగుదొడ్లను కూడా స్వచ్ఛ భారత్ అభియాన్ కింద త్వరలోనే మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాగ్యమ్మను శాలువాతో సత్కరించారు.
సాయం చేస్తా..: అమిత్‌షా
పెద్దదేవులపల్లిలో ఏడు కుటుంబాలను కలసి వారి బాగోగులు తెలుసుకున్న అమిత్‌షా ఇద్దరికి తనవంతు సాయం చేస్తానని హామీనిచ్చారు. గ్రామంలోని బొమ్మపాల శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా.. ఆయన తన మరదలి కుమార్తె భవానీకి తల్లిదండ్రులు లేరని చెప్పారు. దీంతో భవానీని దగ్గరకు తీసుకుని షా మాట్లాడారు. ఆమె అభ్యర్థన మేరకు ఉద్యోగం ఇప్పించే విషయాన్ని చూద్దామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అదే గ్రామంలోని పజ్జూరి సైదులు ఇంటికి వెళ్లారు. తనకు ఉపాధి లేదని, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నందున వెహికిల్ లోన్ ఇప్పించాలని కోరడంతో తప్పకుండా సాయం చేస్తానని అమిత్ షా మాటిచ్చారు.