‘కమలం’ కానరాని వికాసం!
♦ అవకాశం ఉన్నా ఎదగలేకపోతున్నామని ఆవేదన
♦ రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీరుపై జాతీయనాయకత్వం ఆగ్రహం
♦ తెలంగాణలో విస్తరణకు వ్యూహరచన
సాక్షి, హైదరాబాద్: పార్టీ నేతలను కాపాడుకోవడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం వైఫల్యం చెందుతుండడంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం అసంతృప్తితో ఉంది. పార్టీ విస్తరణకు, బలోపేతానికి విశాల దృక్పథంతో పనిచేయకుండా అగ్ర నేతలంతా వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికే పరిమితం అవుతున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలపై ఆగ్రహం వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే, రోజురోజుకు పార్టీ బలం క్షీణించిపోతుండటంపై జాతీయనాయకత్వం ఆందోళనతో ఉన్నట్టుగా సమాచారం. గత ఎన్నికలనాటికి పార్టీలో చేరి ఇప్పటికే నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వంటివారు దూరంగా ఉంటున్నారు.
సంఘ్ పరివార్‌కు దగ్గరగా ఉంటూ, హిందువుల్లో గట్టి అభిమాన గణం ఉన్న రాజాసింగ్ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడంతో జాతీయ నాయకత్వం కూడా రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ దృష్టిని కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎంపీ గెలిచినా కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చామని, జాతీయపార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న నాయకులు కూడా ఎంతో మంది ఉన్నారని జాతీయనాయకత్వం భావిస్తోంది. పార్టీ భవిష్యత్తులో బలం పుంజుకుంటుందనే ఆశాభావంతో రాష్ట్రానికి పలు పథకాల్లోనూ, అభివృద్ధి నిధుల్లోనూ కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నామనే భావిస్తోంది.
కేంద్రంలో అధికారం ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో అందుకు అనుగుణంగా పార్టీ బలాన్ని పెంచుకోవడంలో రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందుతోందని అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లాల వారీగా పార్టీ పుంజుకోవడానికి అవకాశాలున్నా, ఎందుకు అందిపుచ్చుకోవడం లేదనే దానిపై అధ్యయనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. జిల్లాల వారీగా నాయకులను పెంచుకోవాలని, 2019 లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై నివేదికను తయారు చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి నేతలను పరిశీలకులుగా పంపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
కొత్తవారిని చేర్చుకోరు.. ఉన్నవారు పెరగరు
ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరినవారిని పార్టీలో సీనియర్లు, పాత నాయకులు అంటరానివారుగానే చూస్తారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఎంత పెద్దపాత్రను పోషించినా, రాజకీయాల్లో అనుభవం ఉన్నా రాష్ట్ర బీజేపీలో వారిని పట్టించుకోకుండా పాత నేతలు ఏకపక్షంగా పనిచేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండీ, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. అంతకుముందు కూడా చాలామంది సీనియర్లు రాష్ట్ర బీజేపీలో ఇమడలేక వచ్చినంత వేగంగానే బయటకు వెళ్లిపోయారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో అవకాశం ఇవ్వని సీనియర్లు ,కనీసం వారైనా పార్టీ ప్రతిష్టను పెంచడం లేదని విమర్శలున్నాయి. కొత్త వారిని అంగీకరించకుండా, పాత నేతలు బలాన్ని పెంచుకోకుండా పార్టీని ఎలా విస్తరిస్తారనే అసంతృప్తి జాతీయ నాయకత్వంలో ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరణకోసం ప్రత్యేక వ్యూహం అమలుకు అధిష్టానం యోచిస్తున్నట్లుగా పార్టీ ముఖ్యనాయకుడొకరు వెల్లడించారు.