ములాయంకు గట్టి షాకిస్తాం: బీజేపీ
- నేతాజీ సొంత ఊరిలో పాగాకు తీవ్ర కసరత్తు
ఇటావా: కొడుకు అఖిలేశ్ యాదవ్ హైజాక్ చేసిన పార్టీపై తిరిగి పట్టు సాధించేందు ములాయం సింగ్ యాదవ్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో ‘ములాయం సొంత ఊళ్లో సమాజ్‌వాదీ పార్టీని ఓడించాలని’ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటావా జిల్లాలోని నేతాజీ సొంత ఊరు సైఫై.. జశ్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరోకాదు.. నేతాజీ పెద్ద తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్!
1967 నుంచి 1996దాకా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ములాయం.. జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టడంతో ఆ సీటు తమ్ముడు శివపాల్‌కు దక్కింది. శివపాల్ వరుసగా నాలుగు సార్లు(1996 నుంచి నేటి వరకు) అక్కడి నుంచి గెలుపోందారు. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ సీన్ రివర్స్ అయింది. సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటలుగా ముద్రపడ్డ మరో ఐదు జిల్లాల్లో బీజేపీ విజయపతాకం ఎగరేసింది. కాగా, నేతాజీ సొంత ఊరుండే మోయిన్‌పురిలో మాత్రం పరువు దక్కించుకోగలిగారు. తేజ్‌ప్రతాప్ సింగ్ యాదవ్(లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు) ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం పోటాపోటీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అఖిలేశ్, ములాయం వర్గాలు.. జశ్వంత్‌నగర్ స్థానాన్ని మాత్రం ఖాళీగా వదిలేశాయి. దీంతో రెండు వర్గాల కార్యక్తలూ కాస్త తికమకపడ్డారు. శివపాల్ యాదవ్‌కు పోటీగా అభ్యర్థిని దించరాదన్న అఖిలేశ్ ఆదేశాల మేరకే జశ్వంత్‌నగర్ స్థానానికి పేరు ప్రకటించలేదని తెలిసింది. కాగా, గ్రామస్థాయిలో మాత్రం అఖిలేశ్ యాదవ్‌కు ఎల్లడలా మద్దత లభిస్తోంది. పెద్దా చిన్నా అందరూ అఖిలేశే సీఎం కావాలని నినదిస్తున్నారు. అదే సమయంలో వారంతా నేతాజీ(ములాయం)కి సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు.
ఇలా నియోజకవర్గం అంతటా నెలకొన్న విరుద్ధ భావనలే తమ గెలుపును సుగమమం చేస్తాయని బీజేపీ ఆశగా ఎదురుచూస్తోంది. 2014లో ఇటావా స్థానంలో ఎస్పీని చిత్తుగా ఓడించిన బీజేపీ ఎంపీ అశోక్ కుమార్.. గడిచిన కొద్ది రోజులుగా జశ్వంత్ నగర్‌లోనే మకాంవేసి, ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ‘సార్వత్రిక ఎన్నికల మాదిరే 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రతాపం చూపుతుంది. ములాయం సొంత ఇలాకాలోనే ఈ సారి గట్టిషాకిస్తాం’ అని అశోక్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.