ఢిల్లీ కంచుకోటలో ఆప్‌కు ఘోరపరాభవం
రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో చతికిల పడ్డ చీపురుకట్ట
మూడో స్థానానికి పరిమితం.. కమలం హవా
న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలోని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో చీపురు పార్టీ దారుణంగా మూడో స్థానానికి పరిమితమైంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప పోరులో బీజేపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి మన్‌జిందర్ సింగ్ సిస్రా భారీగా 14వేల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ కేవలం 10వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి 40,602 ఓట్లు రాగా, రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ 40,602 ఓట్లు సాధించింది. ఇక డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన ఆప్‌కు 10,243 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ అధినేత ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై పోటీచేసేందుకు రాజౌరి గార్డెన్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినప్పటికీ, రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆప్ ధీమా వ్యక్తం చేస్తున్నది