Rajouri garden
-
ఢిల్లీలో దారుణం: కారుతో ఢీకొట్టి.. బానెట్‌పై అర కిలోమీటర్ లాక్కెళ్లి
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరం ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గత కొంతకాలంగా హస్తీనాలో నేర సంఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. యాధృచికంగా, ఉద్ధేశపూర్వంగా జరిగినా యాక్సిడెంట్లు, హత్యలు వంటి కేసులతో దేశ రాజధాని నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల దేశం మొత్తం ఉల్కికి పడేలా చేసిన కంఝూవాలా కారు ప్రమాదం(కారుతో ఢీకొట్టి అంజలి అనే యువతిని ఈడ్చుకెళ్లిన ఘటన) తరువాత అలాంటి కోవకే చెందిన దారుణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరి వ్యక్తుల మధ్య హారన్ విషయంలో గొడవ తలెత్తింది. వాగ్వాదం పెరిగి పెద్దదవడంతో.. ఓ వ్యక్తి కోపంతో తన కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారు బానెట్‌పై పడటంతో అలాగే 500 మీటర్లు(అర కిలోమీటరు) లాక్కెళ్లాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ఏపీసీ సెక్షన్లు 279, 323, 341, 308 కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ కారు నెంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏ విషయంలో గొడవ జరిగింది, అసలు ఏం జరిగిందనే దానిపై బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. #WATCH | A man was dragged on car's bonnet in Delhi's Rajouri Garden(12.01) An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police (Visuals confirmed by Police) pic.twitter.com/RdVGuU7QXL — ANI (@ANI) January 14, 2023 -
బైక్‌పై వెళుతూ రొమాన్స్..
-
నడిరోడ్డుపై రొమాన్స్.. వైరల్ వీడియో
బైక్‌పై వెళుతున్నప్పుడు ప్రియురాలు వెనుకుంటే కుర్రాళ్లకు పట్టపగ్గాలుండవు. బైక్ ముందున్న ట్యాంక్‌పై గాల్ ఫ్రెండ్ కూచుని ప్రియుడి కళ్లలో కళ్లు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీలో వీడియోకు చిక్కింది ఈ రొమాంచిత దృశ్యం. లోకంతో తమకు పనిలేదన్నట్టుగా బిజీ రోడ్డుపై ఓ ప్రేమ జంట చేసిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరి గార్డన్ క్రాస్ రోడ్డులో ప్రేమ పక్షులు బైక్‌పై దూసుకెళ్లిన ఈ వీడియోను ఐపీఎస్ అధికారి హెచ్జీఎస్ ధలివాల్ ట్వీట్ చేశారు. ‘మోటారు వాహనాల చట్టంలో కొత్త సెక్షన్ తేవాల్సిన అవసరం ఉంద’ని క్యాప్షన్ పెట్టారు. గులామ్ సినిమాలో ‘జాదూ హై తేరా హీ జాదూ’ పాటలో ఆమిర్‌ఖాన్, రాణిముఖర్జీ చేసినట్టుగా ఫీట్ చేసిన ఈ ప్రేమికులు ఎవరో ఇప్పటివరకు తెలియలేదు. యువకుడు బైక్ నడుపుతుండగా ముందున్న ప్యూయల్ ట్యాంక్‌పై కూర్చొని యువతి తన రెండు చేతులను అతడి భుజానికి చుట్టేసి ప్రియుడి కళ్లలోకి చూస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇద్దరూ హుషారుగా బైక్‌పై వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. చట్టప్రకారం ఇది నేరం కానప్పటికీ చాలా ప్రమాదకరం. రద్దీగా ఉన్న రోడ్డుపై ఇలాంటి విన్యాసాలతో ప్రమాదం కొనితెచ్చుకోవడం అవసరమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే నడిరోడ్డుపై ఈ రొమాన్స్ ఏంటని నిలదీస్తున్నారు. -
ఢిల్లీ కంచుకోటలో ఆప్‌కు ఘోరపరాభవం
-
ఢిల్లీ కంచుకోటలో ఆప్‌కు ఘోరపరాభవం
రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో చతికిల పడ్డ చీపురుకట్ట మూడో స్థానానికి పరిమితం.. కమలం హవా న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలోని రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. తన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో చీపురు పార్టీ దారుణంగా మూడో స్థానానికి పరిమితమైంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప పోరులో బీజేపీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి మన్జిందర్ సింగ్ సిస్రా భారీగా 14వేల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ కేవలం 10వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీకి 40,602 ఓట్లు రాగా, రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ 40,602 ఓట్లు సాధించింది. ఇక డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన ఆప్‌కు 10,243 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆ పార్టీ నేత, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీ దళ్ అధినేత ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై పోటీచేసేందుకు రాజౌరి గార్డెన్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినప్పటికీ, రానున్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆప్ ధీమా వ్యక్తం చేస్తున్నది -
శిరోమణి అకాలీదళ్ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మంజీత్‌సింగ్ వెల్లడించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మంజీందర్‌సింగ్ సిర్సా, కల్కాజీ నియోజకవర్గం నుంచి హర్మీత్‌సింగ్ కల్కా. షహధార నుంచి జితేందర్‌సింగ్ షంటీ , హరినగర్ నుంచి శ్యామ్శర్మలను ఎస్ఏడీ తరఫున బరిలోకి దించుతున్నామన్నారు. కాగా సిర్సా... ఎస్ఏడీ గుర్తయిన తూకంతో, మిగతా అభ్యర్థులు కమలం గుర్తుతోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
పేరు కోసం నిధుల వృథా
ఎలాగైనా మరోసారి గెలుపొందాలనే ఆతృతతో ఉన్న ప్రజానిధులు హడావుడిగా ప్రాజెక్టులు ప్రారంభిస్తూ నిధులు వృథా చేస్తున్నారు. కొంతమంది కౌన్సిలర్లు గేట్ల నిర్మాణం కోసమే లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నవంబర్ నెలాఖరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలన్నింటినీ అందంగా చూపించేందుకు చకచకా పనులు మొదలుపెడుతున్నారు. ఇందుకు ఎమ్మెల్యేల స్థానికప్రాంతాల అభివృద్ధి నిధులను వ్యయం చేస్తున్నారు. ఉదాహరణ కావాలంటే బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ ముఖి నియోజకవర్గంలో చూడండి. జనక్‌పురి సీ2 బ్లాక్‌లోని ఐదుచోట్ల అందమైన గేట్లను నిర్మించారు. ఇవన్నీ గత ఆరు నెలల్లోపే వెలిశాయి. దురదృష్టవశాత్తూ స్థానికులు మాత్రం ముఖి ప్రయత్నాలపై పెదవి విరుస్తున్నారు. గేట్ల నిర్మాణం వల్ల నిధుల వృథా తప్ప తమకు ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. ‘మా కాలనీలోని ప్రవేశ, నిష్ర్కమణ ప్రాంతాల్లో ఇది వరకే ఇనుపగేట్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఈ ఐదు గేట్లను నిర్మించింది. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడం మినహా మరేమీ కాదు. ఈ గేట్లతో మాకు ఎలాంటి ఉపయోగమూ లేదు’ అని సీ2 నివాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుల్షన్రాయ్ అన్నారు. జగదీశ్ ముఖి మాత్రం ఇలాంటి వాదనలతో విభేదిస్తున్నారు. ‘జనక్‌పురి వార్డులో ఇది వరకే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అందమైన గేట్లతోపాటు వీధిదీపాలు, స్కేటింగ్‌రింగ్ వంటివి ఏర్పాటు చేశాం. నేను గత 33 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాను’ అని వివరించారు. జనక్‌పురి వ్యాప్తంగా 50 గేట్లు నిర్మించామని తెలిపారు. ఒక్కో గేటుకు రూ.2-7 లక్షల దాకా వ్యయం చేశామని, అన్ని గేట్లపైనా ముఖి ఫొటో ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున నిధులను త్వరగా ఖర్చు (వృథా అని చదువుకోండి) చేయడానికి ప్రజాప్రతినిధులు గేట్ల వంటి అలంకరణలపై ఆసక్తి చూపిస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. రాజోరీగార్డెన్లోనూ ఇలా ఐదుగేట్లను నిర్మించారు. అన్నింటిపైనా స్థానిక కౌన్సిలర్ సుభాష్ ఆర్య ఫొటోలు కనిపిస్తున్నాయి. వీటి పునాదులపై కౌన్సిలర్లు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఈ విషయమై కేంద్ర సమాచార కమిషన్‌కు వివరణ ఇస్తూ ప్రాజెక్టులపై సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లను ఉంచకూడదనే నియమం ఏదీ ఢిల్లీ మున్సిపల్ చట్టంలో లేదని తెలిపారు. గేట్ల వంటి వ్యర్థ ప్రాజెక్టుల కోసం భారీగా నిధుల కేటాయింపును మున్సిపల్ కార్పొరేషన్లు అడ్డుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాజోరీగార్డెన్‌లో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా, ఎందుకూ పనికిరాని గేట్లకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయించడం సరికాదని సమాచార హక్కు చట్టం కార్యకర్త ముకేశ్సూద్ అన్నారు. ఆర్య రాజోరీగార్డెన్ స్థానం నుంచి పోటీకి బీజేపీ టికెట్‌కు కూడా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాంతాలు అందంగా కనిపించడానికి గేట్లు నిర్మిస్తే తప్పేమిటన్నది ఆయన ప్రశ్న.