పేరు కోసం నిధుల వృథా
Published Mon, Sep 30 2013 2:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:10 PM
ఎలాగైనా మరోసారి గెలుపొందాలనే ఆతృతతో ఉన్న ప్రజానిధులు హడావుడిగా ప్రాజెక్టులు ప్రారంభిస్తూ నిధులు వృథా చేస్తున్నారు. కొంతమంది కౌన్సిలర్లు గేట్ల నిర్మాణం కోసమే లక్షలాది రూపాయలు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నవంబర్ నెలాఖరులోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలన్నింటినీ అందంగా చూపించేందుకు చకచకా పనులు మొదలుపెడుతున్నారు. ఇందుకు ఎమ్మెల్యేల స్థానికప్రాంతాల అభివృద్ధి నిధులను వ్యయం చేస్తున్నారు. ఉదాహరణ కావాలంటే బీజేపీ ఎమ్మెల్యే జగదీశ్ ముఖి నియోజకవర్గంలో చూడండి. జనక్‌పురి సీ2 బ్లాక్‌లోని ఐదుచోట్ల అందమైన గేట్లను నిర్మించారు. ఇవన్నీ గత ఆరు నెలల్లోపే వెలిశాయి. దురదృష్టవశాత్తూ స్థానికులు మాత్రం ముఖి ప్రయత్నాలపై పెదవి విరుస్తున్నారు.
గేట్ల నిర్మాణం వల్ల నిధుల వృథా తప్ప తమకు ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. ‘మా కాలనీలోని ప్రవేశ, నిష్ర్కమణ ప్రాంతాల్లో ఇది వరకే ఇనుపగేట్లు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఈ ఐదు గేట్లను నిర్మించింది. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడం మినహా మరేమీ కాదు. ఈ గేట్లతో మాకు ఎలాంటి ఉపయోగమూ లేదు’ అని సీ2 నివాసుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుల్షన్‌రాయ్ అన్నారు. జగదీశ్ ముఖి మాత్రం ఇలాంటి వాదనలతో విభేదిస్తున్నారు. ‘జనక్‌పురి వార్డులో ఇది వరకే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అందమైన గేట్లతోపాటు వీధిదీపాలు, స్కేటింగ్‌రింగ్ వంటివి ఏర్పాటు చేశాం. నేను గత 33 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నాను’ అని వివరించారు. జనక్‌పురి వ్యాప్తంగా 50 గేట్లు నిర్మించామని తెలిపారు. ఒక్కో గేటుకు రూ.2-7 లక్షల దాకా వ్యయం చేశామని, అన్ని గేట్లపైనా ముఖి ఫొటో ఉంటుందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున నిధులను త్వరగా ఖర్చు (వృథా అని చదువుకోండి) చేయడానికి ప్రజాప్రతినిధులు గేట్ల వంటి అలంకరణలపై ఆసక్తి చూపిస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. రాజోరీగార్డెన్‌లోనూ ఇలా ఐదుగేట్లను నిర్మించారు.
అన్నింటిపైనా స్థానిక కౌన్సిలర్ సుభాష్ ఆర్య ఫొటోలు కనిపిస్తున్నాయి. వీటి పునాదులపై కౌన్సిలర్లు, ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. మున్సిపల్ అధికారులు ఈ విషయమై కేంద్ర సమాచార కమిషన్‌కు వివరణ ఇస్తూ ప్రాజెక్టులపై సంబంధిత ప్రజాప్రతినిధుల పేర్లను ఉంచకూడదనే నియమం ఏదీ ఢిల్లీ మున్సిపల్ చట్టంలో లేదని తెలిపారు. గేట్ల వంటి వ్యర్థ ప్రాజెక్టుల కోసం భారీగా నిధుల కేటాయింపును మున్సిపల్ కార్పొరేషన్లు అడ్డుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. రాజోరీగార్డెన్‌లో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా, ఎందుకూ పనికిరాని గేట్లకు రూ.ఐదు లక్షల చొప్పున కేటాయించడం సరికాదని సమాచార హక్కు చట్టం కార్యకర్త ముకేశ్‌సూద్ అన్నారు. ఆర్య రాజోరీగార్డెన్ స్థానం నుంచి పోటీకి బీజేపీ టికెట్‌కు కూడా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రాంతాలు అందంగా కనిపించడానికి గేట్లు నిర్మిస్తే తప్పేమిటన్నది ఆయన ప్రశ్న.
Advertisement
Advertisement