ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటనపై సినీలోకమంతా గళం విప్పుతోంది. బాధితురాలికి ఎదురైన భయానక అనుభవంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే మలయాళీ సూపర్ స్టార్లు మమ్మూటీ, మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ తదితరులు జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితురాలైన నటికి అండగా నిలిచారు. పలువురు దక్షిణాది నటులు కూడా ఈ ఘటనతో షాక్ తిన్నారు. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి. నువ్వు మళ్లీ కార్యరంగంలోకి రావాలని కోరుకుంటున్నా, నిన్నెంతో ప్రేమిస్తున్నా అంటూ సమంత ట్వీట్ చేసింది. తాను కూడా ఆమె వెన్నంటే మద్దతుగా ఉంటానని, ప్రపంచంలోని ప్రేమ, శక్తి ఆమె వెన్నంటి ఉంటుందని హీరో సిద్ధార్థ ట్వీట్ చేశాడు.
'ఒక మహిళపై ఇలాంటి అరాచకం చోటుచేసుకోవడం తీవ్ర దురదృష్టకరం. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించడమే కాదు.. పశువుల కన్నా హీనంగా ప్రవర్తించిన నేరగాళ్లను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడకుండా శిక్షలు ఉదాహరణగా నిలిచిపోవాలి. అలాంటివాళ్లు అసలు మనుషులే కాదు' అంటూ మోహన్‌లాల్ ఫేస్‌బుక్‌లో తీవ్రంగా స్పందించారు.
ఇక బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అఖ్తర్ తదితరులు మలయాళి నటిపై జరిగిన దారుణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన గురించి తెలిసి తన గుండె పగిలిందని హీరోయిన్ శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. ఈ దేశంలో మహిళల భద్రత కోసం ఎవరైనా ఏమైనా చేస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకొని మహిళల భద్రత కోసం కృషి చేయాలని కోరారు.